విరుగుతున్న కల#కోట్ల వెంకటేశ్వర రెడ్డి
నమస్తే తెలంగాణ
విరుగుతున్న కల!
ఆకుపచ్చని కల ఇక్కడ
అన్వయమెరుగని పద్యమైంది.
కత్తి దూస్తున్న కరువు చిత్రం
ఫీనిక్స్ పక్షిలా పైకి లేస్తున్నది!
నేల నేలంతా
నెర్రలు వారిన నైరూప్య చిత్రమైంది.
తేమ లేని గాలి వదలుతున్నది అగ్ని శ్వాస!
జీవనదుల జాలి చూపు ఎదలో
భయం విత్తులు నాటుతున్నది.
తరుముకొస్తున్న ఆకలి దృశ్యాలు
యుద్ధాల కంటే భయంకరమైనవి!
నగరాల నాలుక పిడుచ కట్టుకపోతే
కాలాన్ని నిందించడం తప్ప
కమ్ముకొచ్చే కటిక చీకట్లను కాదనలేం!
వట్టి మాటలతో కాలం
కండ్లు కప్పుతున్న ఏలికలకు
ఎచ్చులకేం తక్కువ లేదు
అన్నింటికీ గతం మీదే నింద!
దశాబ్ద కాలంగా
మూడు కాలాలు తడి నేల మీద
తిరుగాడిన పాదాలు
ఆగ్రహిస్తే అనల జ్వాలలే!!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261
Comments
Post a Comment