15- 9th page
సారభూతుడు అయిన పరమాత్మే కదా! కనుకనే ఈ సంసార వృక్షమును తెలుసుకున్న వాడు
వేదవిదుడవుతున్నాడు. బ్రహ్మవిదుడు అవుతున్నాడు. ఒక వైపు సంసార వృక్షము అనిత్యము కనుక అశ్వత్థము అని అంటూ,
మరొక వైపు అవ్యయము మరియు బ్రహ్మవృక్షము కనుక భజనీయము అని చెప్పడం పరస్పర విరుద్ధం కాదా?
అనే సంశయం స్ఫురించే ప్రమాదం లేక పోలేదు.
సత్యమిధ్యలు
బ్రహ్మ మొక్కటే సత్యం, ప్రపంచమునకు బ్రహ్మమే అభిన్న నిమిత్త ఉపాదాన కారణము. కార్యమైన
ప్రపంచము కారణమైన బ్రహ్మము కన్నా భిన్నం కాదు. కార్యమైన కుండ కారణమైన మట్టేఅయినట్లు,
కార్యమైన ప్రపంచము కారణమైన పరమాత్మే. కానీ, కుండ మట్టే అయినా, మట్టి కుండ కానట్లు, మిధ్య మైన
ప్రపంచము సత్యమైన పరమాత్మే అయినా, సద్రూపమైన పరమాత్మ మిధ్యా ప్రపంచము కాదు. మిధ్య కూడా
బ్రహ్మమే. కాని, బ్రహ్మము మిధ్య కాదు. కనుక ప్రపంచమును ప్రపంచముగా గ్రహించే వాడు వేదవేత్త
కాలేదు. ఎందుకంటే, ప్రపంచము ప్రపంచముగా మిధ్య. ప్రపంచం పరమాత్మగా సత్యం. కనుక,
ప్రపంచమును ప్రపంచముగా కాకుండా పరమాత్మగా గ్రహించే వాడే వేదవేత్త, అతడే బ్రహ్మవేత్త, సర్వం బ్రహ్మమయంగా దర్శించి
అద్వైతానుభూతిలో ఓల లాడేవాడు.
సత్యమును దర్శించే వారికి ఈ అశ్వత్థ మనే సంసార వృక్షము బ్రహ్మవృక్షమే. కనుక అవ్యయము;
భజనీయము. అలా కాకుండా మిధ్యా దృష్టితో ప్రపంచమును ప్రపంచముగా చూచే వారికి ఈ విశ్వవృక్షము అశ్వత్థామే. ఛేదించ దగినదే.
భేదించ దగినదే (ఛిత్వా చభిత్వాచ). కనుక మాయా మోహితులైన వారికి ఈ ప్రపంచము అశ్వత్థ వనము; భ్రాంతిమయము.
మహిమ తెలిసిన వారికి ఈ జగత్తు బ్రహ్మవనము: బ్రహ్మమయము. ఈ విషయాన్ని బ్రహ్మసూత్రాలు విస్పష్టం చేశాయి.
పరాధి ధ్యానాత్తు తిరోహితం తతో హ్యస్య బంధ విపర్యయౌ, ( బ్ర.సూ. 3 - 2 - 5)
అవిద్య చేత కప్పబడిన జీవ స్వరూపం (తిరోహితమ్) పరమాత్మను ధ్యానించడం చేత
(పరాభిధ్యానాత్) వ్యక్త మవుతుంది. కనుక జీవునికి (అస్య) బంధమోక్షాలు (బంధ విపర్యయౌ) పరమాత్మ వలననే
కలుగుతున్నాయి కదా (తతోహి) అనేది సూత్రార్థం. అంటే, పరమాత్మ స్వరూపం తెలియక పోతే బంధము; తెలిస్తే మోక్షము.
అంతే, ఈ సంసార వృక్షానికే మరొక విధంగా, అంటే అన్యంగా లేదా విశేషంగా అవయవ కల్పన చేసి
చెబుతున్నాడు.
.
Comments
Post a Comment