17th slokam
బిచ్చగాణ్ణి చూడగానే, 'నికృష్టుడా! ఎక్కడ చచ్చావు ఇంతకాలం? మళ్ళీ నీ శనిగొట్టు ముఖాన్ని చూపడానికి వచ్చావా?" అని రెచ్చిపోతూ, కోపాన్ని ఆపుకోలేక బలంగా కొడతాడు. ఆ దెబ్బకు బిచ్చగాని రూపంలో ఉన్న రాజు తూలి క్రిందపడి, మెల్లగా లేచి, తన దారిన తాను పోతాడు. అంతే గాని, ఏ మాత్రం దుఃఖించడు. విచారించడు.
ఆ ప్రక్కనే ఒక నిత్యాన్నదాన సత్రం ఉంది. క్రొత్తగా ఉదారులు దానిని నెలకొల్పి ఉన్నారు. వారు
గతంలో ఈ బిచ్చగాణ్ణి చూచి ఎరుగరు. వడ్డీ వ్యాపారి దుష్ప్రవర్తన నంతా చూచి బాధపడిన ఆ సత్రం యజమానులు అతనిని లోనికి తీసుకొని వెళ్ళి, ఓదార్పు మాటలు పలికి, భోజనం పెట్టిస్తారు. బట్టలు ఇస్తారు. కొంత డబ్బు కూడా ఇస్తారు. 'నాయనా! నిన్ను ఆ దుష్టుడు దుర్మార్గంగా బాధించాడు. అది మనస్సులో పెట్టుకోకు. వాడు అంతే. నువ్వు ఇక వెళ్ళు. నీకు ఇంకేమైనా డబ్బు అవసరమా? నిస్సంకోచంగా అడుగు, ఇస్తాము అంటారు. కానీ, రాజువద్దని తల ఊపి, తన దారిన తాను వెళ్ళి, అద్దెకు తీసుకున్న సత్రానికి చేరి, దుస్తులు మార్చుకొని, ప్రశాంతంగా కూర్చుంటాడు. ఏదో అనిర్వచనీయమైన దివ్యానందంలో ఓలలాడుతూ ఉంటాడు. జరిగిన ఈ సన్నివేశాలలో శుభాశుభాలు అతనిని అంటవు. అతడు శుభాశుభాలకు అతీతుడు.
తాను బిచ్చగాడుగా తిరిగినా, అన్ని నాణెముల బిచ్చం లభించినా అతడు సంతసించలేదు. కోట్లకు
అధిపతి యైన రాజు ఆ నాణెములకు సంతసిస్తాడా? (న హృష్యతి). వర్తకుడు నిష్కారణంగా నిందించినా ద్వేషం లేదు. తాను రాజు అని తెలిస్తే అతడు దూషిస్తాడా? అందుకని ద్వేషం లేదు (నద్వేష్టి). తాను స్వతహాగా రాజై ఉన్నందున, కొట్టినా దుఃఖించలేదు (న శోచతి). అన్నసత్రం వాళ్ళు ఆదరించి, ఇంకేమన్నా కావాల్సిఉంటే అడుగు అంటే, పూర్వమైతే ఆశించే వాడేమో గాని, ప్రస్తుతం తాను మకాం ఉన్న సత్రంలో తన దగ్గరే విశేషంగా ధనం ఉండే టప్పుడు ఏమి కోరుతాడు? (న కాంక్షతి). తానేమిటో తనకు తెలిసి, కేవలం లీలామాత్రంగా బిచ్చ మెత్తుకున్న రాజుగారు శుభాశుభాలకు ఎలా అతీతుడో, తన స్వరూప జ్ఞానమును కలిగి ఉన్న ఆత్మవిదుడు ఈ ప్రపంచంలో క్రీడావిలాసంగా చరిస్తూఉన్నా, అలౌకిక ఆనందానుభూతిలో ఓలలాడుతూ ఉంటాడు. ప్రపంచము, ప్రపంచంలోని సన్నివేశాలు జ్ఞానిని కదిలించ లేవు. అవి అతనికి స్వప్నతుల్యాలు. ప్రపంచమే విస్మృతప్రాయము. ఎవరి జ్ఞానము స్థిరమైనదో (యస్య స్థితా భవేత్వజ్ఞా), ఎవరి ఆనందము
నిత్యప్రవాహమో (యస్య ఆనందః నిరంతర). అట్టి జ్ఞానికి ఈ ప్రపంచము విస్మృతప్రాయము
(సః ప్రపంచః విస్తృత ప్రాయః-వివేక చూడామణి)
Comments
Post a Comment