శ్రీ కృష్ణాష్టకమ్ - భావార్థ
వసుదేవుని కుమారుడు, దేవదేవుడు, కంసచాణూరులను వధించినవాడు, దేవకీదేవికి పరమానందమును గూర్చిన వాడును అగు జగద్గురువైన శ్రీ కృష్ణ పరమాత్మకు నమస్క రించుచున్నాను. అవిసిపువ్వువంటి ఆకారము కలిగినవాడును, కంఠ హారముల తోను , అందెలతోను, హస్తాభరణములలోతోను శోభించే ఆకారము గల జగద్గురువగు శ్రీ కృష్ణపరమాత్మకు నమస్కారము. వంపులు తిరిగిన ముంగురులతోను, రత్న కుండలముల తోను, పూర్ణచంద్రునివంటి మోముతో ముద్దులొలికెడి జగద్గురువైన శ్రీ కృష్ణ పరమాత్మకు నమస్కృతులు. మందారపుష్ప పరిమళముతో నిండినదియు, చతుర్భుజములు కలిగినదియు, నెమలిపింఛముతో విలసిల్లు దివ్యదేహము గల జగద్గురువగు శ్రీకృష్ణ పరమాత్మకు వందనములు. పద్మపు రేకులవంటి విశాలనేత్రములతోను, నల్లని మేఘమువంటి శరీరకాంతితోను కూడినవాడై, యాదవు లందరికి శిరోభూషణమువలె ప్రకాశించు శ్రీ కృష్ణ పరమాత్మకు నమోవాక్కములు. పీతాంబరధారియు, తులసిమాలను ధరించి దాని పరిమళముతో, నిండిన దేహమును కలిగి, రుక్మిణీ దేవితో క్రీడ సలుపు జగద్గురువగు శ్రీ కృష్ణ పరమాత్మకు వందనములు, గోపికలను ఆలింగనము చేసికొను సమయంలో వారి స్తనద్వయమునందున్న కుంకుమతో చిహ్నితమైన విశాల వక్షస్థలం కలవాడును, సంపదలకు నిలయమైనవాడున...