ఆప్తవాక్యం #దాసోహం #స్వామి సుందర చైతన్యాననంద

 ఆప్తవాక్యం  దాసోహం 

ప్రభూ!

నేను నీవు కాకపోతే నీవు నాకు లేకపోతే నా బ్రతుకుకు అర్థమేముంది? పరమార్థ మెక్కడుంది?

దగ్గరుండి దూరంగా మసలేటపుడు దూరమై దగ్గర కావటమే మంచి మలుపు అందమైన వలపు.

నిజమని నేనంటే కల అని నీ వంటావు. అయ్యే దెప్పుడో? అని నేను ప్రశ్నిస్తే, కాని దెప్పుడు? అని నన్నే అడుగుతావు. నాలో ఉంటావు. నేనై ఉంటావు. నేను కుమిలితే, నీవు కనుమరు గవుతావు.

నేను నవ్వితే నా నవ్వుల్లో కొసమెరు పవుతావు. పొంగే నా గుండెలో పాలు పొంగే నా గుండెలో

పొంగించే వేడి నీదని. ఊగే నా ప్రేమలో ప్రేమ లూరే నా మనసులో చలువలు నీవేనని,

సాగే నా రాగలతలో పల్లవి నీ అనురాగం చరణం - శ్రీచరణం నా అదృష్టం. నన్ను చూడాలంటే

నీ చూపు జారాలి నిన్ను చూడాలంటే నా చూపు లేవాలి మనిద్దరి కలయిక ఎప్పుడైనా గగనమే

ఈ రహస్యాన్ని కనటం ఎవరికైనా గహనమే. మనసులేని వయసిచ్చావు వయసులేని మనసిచ్చావు

మనసును బాలను చేశావు వయసును బేలగా మార్చావు నీవు దూరమైన క్షణాన

లేనట్లే ఉంటుంది ఆయువు నీవు దగ్గరైన క్షణంలో అందినట్లుంటుంది శతాయువు

మొగ్గనైన నన్ను పువ్వును చేసిన కిరణం నీదే. పువ్వునైన నా పరిమళాలలో స్మరణం నీదే.

పది పదులలో కూడా పగలు ఎందుకో కొందరికి? నాల్గు పదులలోనే రాత్రెందుకో మరి కొందరికి?

ఉదయించినా, అస్తమించినా అరుణరేఖలే ఆకాశంలో ఏది ఉండినా, మరేది ఊడినా

నీ కరుణరేఖలే ఆంతర్యంలో ప్రాణములు నావయినా ఉన్నవి నీ కొరకు అసువులు బాసినా

నే నుండెద కోరిక మేరకు నీవు రానినాడు ప్రాణము లేమి కలిమి? రాకపోకలు తెలిసిన గాలి కొలిమి?

నేర్చుకొంటిని నీ బడిలో నేర్పులన్నీ వార్చుకొంటిని నీ ఒడిలో వాక్కులన్నీ

తీర్చుకొంటిని వడ్డీతో నీదు రుణము కడతేర్చుకొంటిని ఓర్పుతో జన్మరణము.

ఎందరికో నేను తాతను నీకేమో చిన్ని పాపను అందరికీ నీవే తాతవు నాకేమో కనుపాపవు.

నా పలుకు వినాలని పరుగు లెత్తుతారు అందరు నా పలుకు లోని నీ పిలుపును

వినగలిగేవా రెందరు? పలుకు నేర్చిన వారికి వలపు లేదు వలపు తెలిసిన వారికి పలుకు రాదు

పలుకులో వలపు అలవోకగా కలబోసి ఆరని నా గొంతులో తడియై మిగిలావు

మారని నీ ప్రేమలో ముద్దముద్దగా తడిపావు మొగ్గ పువ్వయితే ఆగుతుందా పరిమళం?

పరిమళ సుమాన్ని విడిచిపెడతారా ఈ జనం? అయినా, కొండంత గుండెతో

గగన మంత గుట్టుగా సాగర మంత లోతుగా - మొక్కవోని సౌందర్యంతో

మొక్కను వీడకుండా మొక్కలోనే వాడకుండా నీ చరణాలపై వాలేందుకు

నిరీక్షిస్తున్న నా సుమనస్సులోని మర్మాన్ని నూతన సంవత్సర శుభదినాన

ఎందుకో దాచుకోలేక పోతున్నాను. అంతేకాదు.

దోచుకోమని 'దాసోహ' మంటున్నాను. దోచుకుంటే 'సోహ' మంటూ ఉంటాను.

  • స్వామి సుందర చైతన్యాననంద

Comments

Popular posts from this blog

15- 9th page

18-19