18-19


తొలగిస్తున్నాడు అనే భావన ఎంత అద్భుతము! ఆత్మ అంత అద్భుతము! అలాంటి ఆత్మజ్ఞానిని ఎవరు స్తుతించ గలరు? ఎవరు నిందించ గలరు? అతడు నిందాస్తుతులనే జంటకవుల కవిత్వానికి చిక్కేవాడు కాడు.

నిందాస్తుతులు

దూషించడం నింద. పొగడటం స్తుతి. ఇవే నిందాస్తుతులు. ద్వంద్వ పంచకంలో ఇది చివరి జంట. నిందాస్తుతులు మనుషుల మనస్సులను పొంగిస్తూ, క్రుంగదీస్తూ ఉంటాయి. నిందలు అమాంతం మనస్సును కాల్చేస్తూ ఉంటే, స్తుతులు బుద్ధికి ఊరట నిస్తూ ఉంటాయి. ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. జ్ఞానికి నిందాస్తుతులు విషాద తోషాలను

కలిగించ లేవు కనుక జ్ఞాని వాటి విషయంలో సమానంగా ఉంటాడు. తనపై తనకు గౌరవం లేని వారికే పరుల స్తుతులు సుఖాన్నిస్తాయి. అలాగే నిందలు దుఃఖాన్ని

కలిగిస్తాయి. అన్యుల దూషణ భూషణాలు, తిరస్కార పురస్కారాలు ఆత్మజ్ఞానిని స్పృశించ లేవు. ఏముంది నిందాస్తుతులలో! నిందలు నిందలూ కావు; స్తుతులు స్తుతులూ కావు. అన్నీ పదలయలే. అక్షర విన్యాసాలే. వాచారంభాలే. శబ్ద తరంగాలే.

నిందలలో తత్వం లేదు కనుక, నిందించే వాడు తడబడుతూ తిడుతూ ఉంటాడు. స్తుతులు వాస్తవాలు కావు కనుక, ఒక వైపు స్తుతించే వారు స్వరం పెంచి స్తుతిస్తూ ఉన్నా, అందుకొనే వాడు వేదిక మీద తలదించుకొని తంటాలు పడుతూ ఉంటాడు. ఇలాంటి నిందాస్తుతులు ఆత్మజ్ఞానిని స్పృశిస్తాయా? స్పృశించలేవు కనుకనే అతడు నిందాస్తుతులలో సమంగా శోధిస్తారు. గుణదోషాలకు అతీతుడైన ఆత్మవిదుని దోషకథన రూపమైన నిందలు, గుణ కథన రూపమైన స్తుతులు చేరలేక వెను దిరుగుతాయి.

మౌనము అంటే వాఙ్ని యమము. మౌనము కలవాడు మౌనవంతుడు. అంటే వాక్కును నియమించుకున్నవాడు (మౌనీ మౌనవాన్ సంయతవాక్). వాక్కును నియమించడము అంటే, మాట్లాడటం మానేయడం కాదు.

లేని మూగతనాన్ని కొని తెచ్చుకోవడమూ కాదు. అవసరమైన విషయాన్ని మాట్లాడటము, అది కూడా ఎంతఅవసరమో అంత విషయాన్నే భావగర్భితంగా మాట్లాడటము. ఇదే వాఙ్ని యమము. అంతేగాని, మాటల్ని మూటకట్టేసి మనస్సులో మథన పడటం కాదు. మౌనము అనేది మనన శీలత్వం కొరకే. అంతేగాని, మౌనం అలంకారమూ కాదు, ఆభరణమూ కాదు. జ్ఞానికి మౌన మనేది సహజంగా ఉంటుంది. సాధకుడు అతివాగుడు తగ్గించుకోవడానికి, అనర్థాన్ని నివారించుకోవడానికి మౌనాన్ని అభ్యసించ వలసి ఉంటుంది.

సంతుష్ట చిత్తుడు

ఆశించింది చేతి కందితే జనులు తృప్తి చెందుతూ ఉంటారు. వారి తృప్తి కొన్నిటి మీద ఆధారపడి

ఉంటుంది. అలా గాక, దేనితోనైనా (యేన కేనచిత్) సంతృప్తి చెందే వాడు జ్ఞాని, లేదా భక్తుడు (సంతుష్ట). దేనితోనైనా సంతృప్తి చెందేవాడు అంటే, ఏది వచ్చినా అసంతృప్తి చెందని వాడు అని అర్థము. అంటే, ఏది రాకపోయినా సంతోషంగా ఉండేవాడు అని భావము. తన సంతృప్తికి ఏదీ అవసరము లేని వాడు. సదా తానే సంతృప్తిలో ఉండే వాడు. నిత్య సంతోషి, నిత్యపూర్ణుడు. సముద్రం లాగా తన పూర్ణత్వము, లేదా సంతోషము దేనిపైనా ఆధారపడి లేదు. అలాంటి

(యేని కేన చిత్ సంతుష్టః ), సంతుష్ట చిత్తుణ్ణి మహాభారతము బ్రాహ్మణుడు అన్నది. అంటే, బ్రహ్మజ్ఞానముతో నిత్య సంతుష్టుడై ఉండే వాడే బ్రాహ్మణుడు.

యేన కేనచి దాచ్ఛన్నో యేనకేనచి దాశితః ।

యత్ర క్వచన శాయీ స్యాత్ తం దేవా బ్రాహ్మణం విదుః

లభించిన దానితో దేహాన్ని కప్పుకొని, ప్రాప్తించిన దానిని ఆరగించి, ఎక్కడో ఒక చోట శయనించి,

కాలాన్ని వెళ్ళబుచ్చే మహాత్ముడు బ్రాహ్మణుడు అని మహాభారతము-శాంతిపర్వము. కేతుడు

నికేతము అంటే ఇల్లు, లేదా నివాస స్థానము అని అర్థము. ఇల్లు, లేదా ఆశ్రయము కలవాడు నికేతుడు. అలా ఆశ్రయము, లేదా ಇల్లులేని వాడు అనికేతుడు (నికేతః ఆశ్రయః నివాసః న విద్యతే యస్య సః అనికేతః). భక్తుడు ఇల్లు లేని వాడు అంటే, భక్తుడైన వానికి ఇల్లంటూ ఉండ కూడదని, అవసర మనకుంటే, అద్దె కొంపలో నివసించాలని వ్యాఖ్యానించిన ప్రబుద్ధుల ప్రవచనాలు కూడా బాల్యంలో నేను విన్నాను. ఇల్లు లేని వాడు అంటే, తన కంటూ ఇల్లు లేని వాడు అని కాదు.

తనదంటూ ఇల్లు లేని వాడు అని అర్థము. మమకారం లేని వాడు. మమ బుద్ధి లేని వాడు.

ఏ ఇంటి యజమాని నైనా ‘ఎవరి దండీ ఈ ఇల్లు' అంటే ఏమి చెబుతాడు? నా దండీ' అంటాడు. అదేమమ బుద్ధి, నికేతుని బుద్ధి. అది లేని వాడు అనికేతుడు. ఇల్లు లేని వాడు కాదు. 'నా ఇల్లు' అనేది లేని వాడు. కార్యాలయంలో పని చేస్తాం. అది మన దవుతుందా? కొంతసేపు హోటల్లో కూర్చుంటాం. ఆ హోటల్ నదా? మన దైతే బిల్లు చెల్లిస్తామా? స్నేహితుల ఇళ్ళల్లో, బంధువుల ఇళ్ళల్లో కొంత కొంత కాలం గడుపుతాము. కొన్ని గంటలు సినిమా థియేటర్ లో కూర్చుంటాం. అలాగే రోజుకు కొన్ని గంటలు ఇంటిలో ఉంటాము. ఏది మనది? ఈ ప్రపంచంలో మనది ఎక్కడుంది? మనదే అయితే, మనం పోయేనాడు అదికూడా మనతో రాదెందుకని? రాకపోతే పోయె! ప్రాణం పోయిన క్షణాన, మనది మనది అని అల్లాడిన ఇల్లు మనల్నే లోపల ఉంచుకోవ డానికి ఇష్ట పడదు. వెంటనే గుమ్మం దాటించ మంటుంది. ఇది గ్రహించిన భక్తుడు మమ బుద్ధి లేకుండా జీవిస్తాడు. భూ ప్రపంచంలోనే నీకు ಇಲ್ಲು లేదని వేదాంతం చెబుతూ ఉంటే, వెన్నెల పురుగులు అమాంతం అవనిని విడిచి, ఆకాశంలో ఆశ్రయాలు నిర్మించుకోవాలని తహతహ లాడుతున్నాయి. 'ఆలు లేదు - చూలులేదు, కొడుకు పేరు ఆదిలింగం'- ఇదీ వరుస. చూలు అంటే గర్భము, లేదా బిడ్డ అని అర్థము. చందమామలో నీళ్ళున్నాయో లేదో నని శాస్త్రజ్ఞులు ఒక వైపు పరిశోధనలు చేస్తూ ఉంటే, మమకారరాయుళ్ళు మరొక వైపు చంద్రునిలో స్థల సేకరణకు యత్నిస్తూ ఉన్నారు. ఇదే అదను అనుకొని కొందరు విక్రయించే ప్రయత్నంలో విరామం లేకుండా అలసి పోతున్నారట! ఏం చేద్దాం! మమ బుద్దికి రెక్కలొచ్చాయి. ప్రస్తుతం అంతరిక్షంలో ఉంది. ఊపిరి ఆడకుండా ప్రాణం అల్లాడుతోంది. అల్లాడే ప్రాణాన్ని చూస్తూ మనస్సు అస్థిరంగా ఉంది. మమత్వ బుద్ధి ఉన్నంత వరకు స్థిరత్వం ఉండదు. మమత తొలగితేనే స్థిరత.

స్థిరమతి

అస్థిరమైన మతి గలవాడు మందమతి. స్థిరమైన మతి గలవాడు స్థిరమతి. అదే స్థిర బుద్ధి, స్థిర మైనది ఏదో దాని యందు నిలిచే బుద్ధి. స్థిర మైనది పరబ్రహ్మ మొక్కటే. అట్టి పరబ్రహ్మము నందు స్థిరంగా నిలిచే బుద్ధి స్థిరబుద్ధి (స్థిరమతిః - స్థిరా పరమార్థ వస్తు విషయా మతిః యస్య సః స్థిరమతిః). స్థిరమైన జ్ఞానము కలిగిన బుద్ధి. స్థిరమైన ప్రజ్ఞ, స్థితప్రజ్ఞ, అట్టి స్థితప్రజ్ఞుడు భక్తుడే. భక్తుడు తప్పక స్థితప్రజ్ఞు డవుతాడు. అందుచేత భక్తుడు భగవంతునికి ప్రియుడు (భక్తి మాన్ మే ప్రియః నరః). భక్తి మోక్ష సాధనము అనే విషయంలో సందేహం అవసరం లేదు. అద్వేష్టాది శ్లోకాలలో చెప్పబడిన ముప్పై ఐదు లక్షణాలు జ్ఞానిలో స్వరూపతః శోభిస్తూ ఉంటాయి. భక్తులైన కర్మయోగులను అవి సాధ్యరూపంలో అలరిస్తూ ఉంటాయి. ఈ అధ్యాయ సారము నంతా సింహావలోకనంగా చివరి శ్లోకంలో చెబుతున్నాడు.


Comments

Popular posts from this blog

మంచిమాటలు

15- 9th page

17th slokam