16th slokam

వ్యాఖ్య భక్తుడు ఏ విధమైన అపేక్ష లేనివాడు. ఏ కోరిక లేనివాడు. కోరదగిన విషయాలయందు స్పృహ లేని వాడు (అపేక్షా విషయేషు అనపేక్షః నిస్పృహః). సర్వకామ వినిర్ముక్తుడు. తన మనుగడకు, సుఖానికి మరొక దానిపై ఆధారపడని వాడు. దేహానికి, ఇంద్రియాలకు, మనస్సుకు సంబంధించిన బాహ్య విషయాల యందు అపేక్ష లేనివాడు అనపేక్షుడు. కోరేవాడు ఎవడైనా కోరబడే వాటికి వశుడే. భక్తుడే. ప్రాపంచిక విషయాలను ఆశించే వాడు ప్రపంచానికి వశుడై ఉంటాడు. ప్రపంచానికి భక్తుడై ఉంటాడు. ప్రపంచానికి భక్తుడైన వాడు పరమేశ్వరునికి భక్తుడు కాలేడు. పరమేశ్వరునికి భక్తుడైన వాడు ప్రపంచం విషయంలో విభక్తుడై ఉంటాడు. నిత్య వస్తువుతో సంబంధం కలిగి ఉండటం చేత అనిత్య విషయ సంబంధాలలో అనాసక్తుడై ఉంటాడు. అతడే అనపేక్షుడు. శుచిర్భూతుడు భక్తుడు పరిశుద్ధుడు. నిర్మలమైన వాడు. అందుచేత శుచిర్భూతుడు (శుచిః). శౌచము అనేది రెండు విధాలు. ఒకటి బాహ్య శౌచము, రెండవది అంతఃశౌచము. బాహ్య శౌచమే గాక, అంతఃకరణ శౌచము కూడా కలిగిన వాడు భక్తుడు. అందుకే అతడు శుచిర్భూతుడు (శుచి: బాహ్యేన అభ్యన్తరేణ చ శౌచన సంపన్న). దేహ శుభ్రత, వస్త్ర శుభ్రత, పరిసరాల శుభ్రత, పరికరాల శుభ్రతను పాటించడం బాహ్య శుభ్రత. అదే బాహ్య శౌచము. అలాగే పరిశుద్ధమైన సంకల్పాలు, నిర్మలమైన భావాలు మనస్సులో కలిగి ఉండటము, దానితోపాటు ఈర్ష్య, అసూయ, క్రోధ, భయ, ద్వేషాదులు అనే మాలిన్యాలు చిత్తములో లేకుండా చూసుకోవడము అంతఃశౌచము. భక్తుడు ఈ రెండు శౌచములను కలిగి ఉంటాడు కనుక శుచిర్భూతుడు. స్వరూప జ్ఞానం చేత జ్ఞాని, ఈశ్వర ప్రణిధానము చేత భక్తుడు అనపేక్షులని ముందు లక్షణములోనే చూశాము కదా! ఫలాపేక్ష లేదు అంటే, ఫలసంగం లేదు. ఫలసంగం లేని వానికి కర్మసంగం మాత్రం ఎందుకుంటుంది? కర్మసంగం లేకపోవడమే శౌచము (కర్మసు అసంగమః శౌచమ్). కర్మల యందు అనాసక్తియే శౌచము. అశౌచానికి అవకాశము ఇవ్వని శౌచము జ్ఞానికి అకర్తృత్వం వల్ల ప్రాప్తిస్తే, భక్తునికి నిమిత్తమాత్రంగా జీవించడం వల్ల లభిస్తుంది. దక్షుడు దక్షత అంటే సమర్థత. దక్షత కలవాడు దక్షుడు. తెలుసుకొన వలసినవి ఉన్నప్పుడు వాటిని స్పష్టంగా తెలుసుకొనే వాడు భక్తుడు. అతడే దక్షుడు. చేయదగినవి ఉన్నప్పుడు వాటిలో ఏ విధమైన అస్పష్టత చోటు చేసుకోకుండా చక్కని ఆచరణము కలవాడు దక్షుడు (ప్రత్యుత్పన్నేషు కార్యేషు సద్యః యథావత్ ప్రతిపత్తుం సమర్థః దక్షః). జ్ఞాతవ్య కర్తవ్యములయందు సమర్థుడైనవాడు దక్షుడు. దక్షునిలో సమయస్ఫూర్తి ప్రధానమైనది. అందుచేత గ్రహించ వలసిన దానిని వెంటనే గ్రహించే సమర్థత, చేయవలసిన దానిని వెంటనే (సద్యః) చేయగలిగే దక్షత భక్తుడైన దక్షునికి ఉంటుంది. ఈ విధమైన సమర్థత జ్ఞానికి సమ్యక్ జ్ఞానము వలన, కర్మయోగికి చిత్త ప్రసాదము వలన సాధ్య మవుతుంది. ఉదాసీనుడు పక్షపాతము లేనివాడు ఉదాసీనుడు. తన కంటూ ఒక పక్షము లేనివాడు. తాను మరొక పక్షమును ఆశ్రయించని వాడు ఉదాసీనుడు (న కస్యచిత్ మిత్రాదేః పక్షం భజతే యః స ఉదాసీనః). తటస్థ వైఖరి కలవాడు. అతడే యతిపురుషుడు. నిర్మముడు, నిరహంకారుడు అని పూర్వ లక్షణాలలో మనము చర్చించుకున్న భక్తుని వైభవమే ఈ ఉదాసీనతకు హేతువు. ఉదాసీనుడు అంటే దేనినీ పట్టించుకోని వాడు అనేది అర్థం కానే కాదు. దేనిని పట్టించుకున్నా దానికి పట్టుబడని వాడు ఉదాసీనుడు. ముట్టీ ముట్టని వాడు. అంటీ అంటని వాడు. ఉన్నట్లే ఉన్నా లేనివాడు. అద్దంలాంటి వాడు. అద్దం లాగా అర్థం చెప్పేవాడు. ఇంటిలో ఉంటే, బయట ఉండేది కనిపించదు. బయట ఉంటే, లోన ఉండేవారు కనిపించరు. గడప మీద ఉంటే, బాహ్యాభ్యంతరాలలో ఉన్నదంతా గోచర మవుతుంది. ఒక పక్షం వహించే వారికి రెండవ పక్షము అర్థం కాదు. ఏ పక్షము లేకుండా మధ్యస్థులైన వారికి ఉభయ పక్షాలూ అర్థ మవుతాయి. అదే ఉదాసీనత లోని వైభవము. గతవ్యథుడు వ్యథ అంటే బాధ. భయంతో కూడిన ఆవేదన. దేనిచేత జనులు భీతి చెందుతారో, కలత పడి చలిస్తారో, దానిని వ్యథ అన్నాడు అమరసింహుడు (వ్యథ భయ చలన యోః).అలాంటి భయం ఎవరి హృదయంలో అదృశ్యమైందో అతడు గతవ్యథుడు. భయంలేని వాడు. భయం పోయినవాడు (గతవ్యథః గత భయః). గతము అంటే పోయింది అని అర్థము. ఏదైనా పోయింది అంటే, ఉన్నది పోతుందే గాని లేనిది పోదు. వ్యథ పోయింది అంటే, అలా పోక ముందు అది ఉంది అని అర్థము. ఎక్కడ ఉంది? ఎక్కడ నుండి పోయిందో అక్కడ ఉంది. చిత్తములోనే ఉంది. చిత్తమునుండే నిర్గత మైంది. చేయ వలసినవి చేయక పోవడము, చేయ కూడనివి చేయడము, అలాగే ప్రాప్తించ వలసినవి ప్రాప్తించకపోవడము, ప్రాప్తించ కూడనివి ప్రాప్తించడము వ్యథకు కారణాలు. ఇవే తాపాన్ని కలిగిస్తాయి. జ్ఞాని తాను అకర్త, అభోక్త అనే జ్ఞానంతో సంపన్నుడై ఉండటంచేత, కృత్యాకృత్యములు అతనిని బాధించలేవు. న ఏనం కృతాకృతే తపతః - చేసినవి, చేయనివి రెండూ జ్ఞానిని తపింప చేయవు అన్నది వేదం. అందుచేత జ్ఞాని గతవ్యథుడు. ఇక భక్తుడు పరమేశ్వరుని ఆశ్రయంలో ఉండటం చేత, బాధలు, భయాల నుండి విడిపడి గతవ్యథుడై ప్రసన్నుడై ఉంటాడు. సర్వారంభ పరిత్యాగి కర్మలన్నీ ఆరంభాలు. మొదలయ్యేవి ఆరంభాలు. ఇహపర సంబంధమైన కర్మలన్నీ ఆరంభాలే. అట్టి కర్మలనన్నిటినీ విడిచి పెట్టిన వాడు సర్వారంభ పరిత్యాగి (కర్మాణి సర్వారంభాః, తాన్ పరిత్యక్తుం శీలం అస్యేతి సర్వారంభ పరిత్యాగీ). ఆత్మకు కర్మలు లేవు. ఆత్మ యందు కర్మలు ఆరంభాలు కావు. ఆత్మ తానే అనే ఎరుక గల జ్ఞాని కర్మలు చేసినా చేయని వాడే. కనుక అతడు సర్వారంభ పరిత్యాగి. కర్తృత్వాభిమానం లేకుండా కర్త భగవంతుడే గాని తాను కాదు అని భావించడం చేత భక్తుడు కూడా సర్వారంభ పరిత్యాగియే.

Comments

Popular posts from this blog

మంచిమాటలు

మంచిమాటలు

15- 9th page