15 slokam
చైతన్య భగవద్గీత భక్తి యోగం 15 వ శ్లోకం
యస్మా న్నోద్విజతే లోకో లోకా న్నోద్విజతే చ యః I
హర్షమర్ష భయోద్వేగై ర్ముక్తో యః స చ మే ప్రియః II 15 II
యస్మాత్-న-ఉద్విజతే-లోకః-లోకాత్-న-ఉద్విజతే-చ-యః
హర్షమర్షభయోద్వేగైః-ముక్తః-యః-సః-చ-మే-ప్రియః
అర్జునా! భక్తుని వల్ల లోకానికి బాధ ఉండదు. లోకం వల్ల భక్తునికి బాధ లేదు. అతడు భక్తుడంటే! ఆనంద ఆక్రోశాలు, భయావేశాలు అతనిని చేరలేవు. అట్టి భక్తుడే నాకు ప్రియుడు.
వ్యాఖ్య
బాధ అనేది భరించ దగింది కాదు. హింస అనేది సహించ దగిందీ కాదు. అలాంటి వాటిని భరించాలన్నా,భరించే పరిస్థితిని ఊహించాలన్నా, మనిషి ఉద్వేగానికి లోనవుతాడు. ఇవన్నీ భయాలు. భయాలు ఎవరికీ ఆరోగ్యప్రదం కావు. వాటికి ఎవరూ గురి కాకూడదు. అలాంటి భయరహిత సమాజాన్ని మానవలోక మంతా ఆశిస్తోంది. కానీ, లోకం అభయ స్థానంగా మారాలి అంటే, లోకం గీతా భక్తులతో నిండి పోవాలి. గీతను అర్థం చేసుకున్న వారు జీవించే లోకమే అభయ ప్రదేశంగా మారుతుంది. గీతాజ్ఞానమే లోకానికి
అభయ ప్రదానం చేయ గలుగుతుంది. ప్రస్తుత శ్లోకం ఈ సత్యాన్ని స్పష్టం చేస్తుంది. భగవద్గీతలో నాకు అత్యంత ప్రియమైన శ్లోకాలలో ఇదొకటి.
పెట్టేది లేదు - పడేది లేదు
భక్తుడు ఎవరినీ బాధ పెట్టడు. అందుచేత, భక్తుని వల్ల లోకానికి భయం లేదు, సంతాపము లేదు,
సంక్షోభమూ లేదు. ఎంత అద్భుతమైన లక్షణమో! ఎవరినీ బాధలకు గురి చేయకుండా జీవించడముఎందరికి సాధ్యం? భక్తులకే సాధ్యం. జ్ఞానం కల వారికే సాధ్యం. అందుకే, జ్ఞానులు ఎవరికీ భయ కారణం కారు.
చీకటిలో అందరూ భయ పడతారు, చీకటి పురుగులు తప్ప. ఏదీ తెలియని స్థితియే చీకటిలో భయ
పడటానికి కారణము. తిమిరము భయ హేతువు. కానీ తేజము తిమిరాన్ని హరించినట్లు, జ్ఞానము అజ్ఞానాన్ని హరిస్తుంది. అజ్ఞాన జనిత భయాన్ని, బాధను పోగొడుతుంది.
జ్ఞాని సదా ఆత్మనే దర్శిస్తూ, ఆత్మాపమ్య బుద్ధితో శోభిస్తూ ఉంటాడు. పరమ కారుణికత్వంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. దానికి తోడు క్షమావంతుడై ఉంటాడు. కనుక, అట్టి జ్ఞాని వల్ల, లేదా భక్తుని వల్ల లోకం సంతాపం చెందదు (యస్మాత్ జ్ఞానినః సన్న్యాసినః లోకం న ఉద్విజతే న సంక్షుభ్యతే).
తాను లోకాన్ని ఉద్వేగానికి, భయానికి, బాధకు గురి చేయకుండా అభయ రూపుడుగా ఉండటమే
గాకుండా, తాను కూడా లోకం వల్ల సంతాపం చెందకుండా ఉంటాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నేనెవరినీ కష్ట పెట్టనండీ - అయినా ఎందుకో నన్ను అందరూ కష్ట పెడుతూనే ఉంటారు. బాల్యం నుండి నా బ్రతుకింతే అంటూ విచిత్ర మైన విషయాన్ని చాలా మంది వినిపిస్తూ ఉంటారు.
ఈ ప్రపంచంలో ఒకరిని మరొకరు బాధ పెట్టలేరు. అలాగే ఒకరి నొకరు సుఖపెట్టనూ లేరు. సుఖ
దుఃఖాలనేవి అన్యులపై ఆధారపడి లేవు. మన ఆలోచనా విధానమే సుఖదుఃఖాలకు కారణం.
సుఖపడే మనసున్న వారిని ఎవ్వరూ కష్టపెట్ట లేరు. దారి తప్పిన ఊహలతో చరించే మనస్సును ఎవ్వరూ సుఖపెట్ట లేరు. నిష్కారణంగా లేనిపోనివి ఊహించుకొని బాధ పడే వారిని బాధ పెట్టడానికి మరొకరు అవసరమా? అసలు ఈ ప్రపంచంలో భయ కారణాలు లేవు, బాధా కారణాలు లేవు అని తెలియక పోవడమే భయాలకు, బాధలకు ప్రధాన కారణము. బాధలకు ప్రపంచం కారణం కాదు. ప్రపంచం కారణం కాదని తెలియక పోవడమే బాధలకు కారణం. అవగాహనా రాహిత్యమే బ్రతుకును ఆవేదనా నిలయంగా మార్చేస్తుంది. ఈశ్వర జ్ఞానంతో జీవించే జ్ఞాని, లేదా భక్తుడు సర్వం ఈశ్వరమయంగా ప్రేమపూరిత నేత్రాలతో వీక్షించడం చేత, జ్ఞానపూరిత చక్షువులతో దర్శించడం చేత అతడు లోకాన్ని భయపెట్టడు. అలాగే లోకం వల్ల భయపడడు. తాము నీళ్ళను భయపెట్టకుండా, నీళ్ళ వల్ల తాము భయపడకుండా చేపలు నదిలో చరించినట్లు, భక్తుడు సమాజంలో సంచరిస్తుంటాడు. అలాంటి భక్తులను కలిగిన సమాజం శాంతి నిలయమవుతుంది.
అంతేగాని, భయ పెట్టే క్రోధనులతో, భయపడే పిరికి వాళ్ళతో నిండిన సమాజం శాంతి నిలయము కాకపోగా, అశాంతి స్థావరంగా మారి పోతుంది.
అత్యుగ్రైః జల జన్తుభిః జలనిధిః న ఏవాధిమేతి క్షణం నో యాదాంసి భజన్తి భీతి ముదధేః అత్యూర్జితాత్
సర్వతః - భయంకరమైన జల జంతువులు తనలో చరిస్తూ ఉన్నా, సముద్రము క్షణం కూడా భయానికిలోను కాదు. అలాగే సముద్రములో జీవించే జల జంతువులు కూడా అగాధమైన సాగరము వల్ల భీతి చెందవు. జ్ఞానికి, లేదా భక్తునికి ఈ లోకంతో సంబంధం అలాగే ఉంటుంది. ఇది సామ్యము. అవగాహనా సౌలభ్యం కొరకే ఈ దృష్టాంతము. దృష్టాంతము ఎప్పుడైనా, ఎక్కడైనా ఏకదేశీయమే నని మనం చెప్పుకొనే ఉన్నాము.
దూరం కాలేదు - దూర మయ్యాయి
భయపెట్టని, భయపడని మహోన్నత శీలవంతుడైన జ్ఞాని ప్రియమైనది ప్రాప్తించినపుడు కలిగే హర్షమునకులోను కాడు. ప్రియవస్తు ప్రాప్తిలో ఉత్పన్నమయ్యే గగుర్పాటు, అశ్రుస్రావము మొదలైన ఆనంద అభివ్యక్త చిహ్నాలతో కూడిన ఉత్కర్ష నుండి, లేదా చిత్త విక్షేపము నుండి విడిపడి ఉంటాడు.
అమర్ష మంటే అసహనము (అమర్షః అసహిష్ణుతా). ఇతరుల యొక్క ఔన్నత్యాన్ని చూచి సహించలేకపోవడం అమర్ష. సర్వత్ర సమదర్శనం చేసే జ్ఞానిలో, లేదా ఆ ప్రయత్నంలో కొనసాగుతున్న భక్తునిలో ఇలాంటి అసహనము అనూహ్యము.
హర్షామర్షాలు లేనట్టే, భయ ఉద్వేగాలు కూడా ఉండవు. అద్వయ దర్శనం చేత భయము, చిత్త
సంతాపములేని కారణంగా ఉద్వేగము భక్తునిలో గోచరించవు. హర్షమర్ష భయోద్వేగాల నుండి అతడు ముక్తుడు (హర్షమర్ష భయోద్వేగైః ముక్తః). అలాంటి భక్తుడు భగవంతుడికి ప్రియుడట (యః సఃమే ప్రియః).
ఇక్కడ ప్రధానంగా ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఖైది సంకెళ్ళను విడగొట్టుకొని పారిపోయినట్లు, హర్షామర్ష భయోద్వేగాలను భక్తుడు బలవంతంగా విడిపించుకోలేదు. శిక్షాకాలం ముగిసిన ఖైదీకి విడుదల సమయంలో సంకెళ్ళు వాటంతట అవే విడి పోయినట్లు, హర్షాదులు జ్ఞాని నుండి వాటంతట అవే జారి పోయాయి. మేల్కొనిన వాని నుండి స్వప్న దృశ్యాలు దూరమైనట్లు దూరమయ్యాయి. సూర్యోదయంతో తిమిరాలు అదృశ్యమైనట్లు అదృశ్య మయ్యాయి.అంతే.
మరి కొన్ని అమృత విశేషణాలను చెప్పుకుందాం.
Comments
Post a Comment