నవ్విన పువ్వులు - స్వామి సుందర చైతన్యానంద
నవ్విన పువ్వులు
మధురమైన భావాలను
సుమధురమైన పదజాలంలో తురిమి
మృదుమధురమైన కవితా పల్లకీలో కూర్చోబెట్టి
ఊరేగించేదే కవిత్వమైతే,
దానికి ముందు మాట రాసేందుకు
కవిగా నేను ముందుకు రాలేదు.
మీ ముందుకు రాలేను.
కవిత్వ మనేది కేవలం సమదర్శనమే నని
కవి ఏనాడైనా క్రాంతదర్శియే నని
నిజాలను ప్రదర్శించే యత్నంలో
ఋజువులను సృష్టించే ప్రయత్నంలో
యోజనాలను దూరాలుగా, భారాలుగా భావించక
ప్రయోజనాలనే భవ్యంగా, భావ్యంగా తలచి
జననాడిని కుదిపి
జీవనాడిని తెలిసి
జీవన స్రవంతి నిరాటంకంగా సాగేందుకు
అవరోధాలను తొలగించి
రేపటి ఆశకు తెరదించి
నిన్నటి నిరాశకు సమాధి కట్టి.
నేటిని మేటిగా నిలిపేందుకు
సర్వాన్ని సర్వంలో కలిపేందుకు -
కవిత్వమొక సాధనమైతే,
కవిగా నేను సాధకుణ్ణి
సాధ్యాన్ని కూడా.
అవలోకించే వారికి సుందర వనాన్ని
అండ చేరే వారికి చైతన్య నిలయాన్ని
ఆస్వాదించే వారికి ఆనందాలయాన్ని,
ఈ వనంలో
విరబూసిన వేదాంత సుమాలే చైతన్య స్వరాలు
ఈ నిలయంలో
విరజిమ్మిన విజ్ఞాన సౌరభాలే చైతన్య రాగాలు
ఈ ఆలయంలో
విరివిగ వితరణ చేయబడిన ప్రసాదాలే చైతన్య గానాలు.
ఈ పాటల్లో
మంచి చెడుల మర్మాలున్నాయి.
ధర్మాధర్మాల సందడులున్నాయి.
వివేకాన్ని పంచే అంగడులున్నాయి.
పూజించేందుకు గుడు లెన్నోఉన్నాయి.
వెల కట్టేందుకు యతి ప్రాసలున్నాయి.
వెల కట్ట లేని యతి శ్వాసలున్నాయి.
మాసిపోని మాటలున్నాయి.
హద్దులు దాటిన పదాలున్నాయి.
తెల్లని కాగితాలపై తేలియాడే ఈ నల్లని రాతలు.
కాలం చెల్లే రాతలు కావు. కాలంలో చెల్లని రాతలూ కావు.
ఇవి జ్ఞానక్షీరాన్ని అందించే మాతలు
తప్పకుండా తుడుస్తాయి మన తల రాతలు.
ఇందులో,
కవిలేదు. కవిత్వముంది.
గాయకుడు లేదు. గానముంది.
వేదాంతి లేదు. వేదాంతముంది.
కర్త లేకుండా సాగిన కర్మ ఇది. యజ్ఞమిది. జ్ఞానయజ్ఞ మిది.
వసంతాన్ని చూచేందుకు కళ్ళు సరిపోతాయి.
అనుభవించేందుకు హృదయ ముండాలి.
సున్నితమైన ఒక హృదయం ఒలికించిన
కవితా సుధలను పట్టి నిలుపుకొనేందుకు
సరియైన పాత్ర మరొక సున్నిత హృదయమే.
హృదయేశుని రస మందిరమే.
సరసమయ నవరస మందిరమే.
సమరస మందిరమే.
కలలను కరిగించే
కవి ఉషస్సులో
ప్రార్థననే ప్రాణవాయువుగా పొందిన
ఓ కిరణం
స్వామి సుందరచైతన్యావంద
Comments
Post a Comment