బిడ్డ అన్నం తినగానే
బిడ్డ అన్నం తినగానే, రూపాయి బిళ్ళ తిరిగి ఇవ్వమని తండ్రి మారాం చేయడం ప్రారంభిస్తాడు. పిల్లవాడు ఇవ్వ నంటాడు. తండ్రి గద్దిస్తూ ఉంటాడు. బిడ్డ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకండీ! బిడ్డను అలా ఏడిపిస్తారు? అని నివారించే ప్రయత్నం చేస్తుంది తల్లి. వాడు పారేసుకుంటాడు అంటాడు తండ్రి.
మీరు కాస్త ఊరుకోండి. నాయనా! నువ్వు ఇవ్వొద్దులే. నీ చేతి లోనే ఉంచుకో. నేను జోల పాడతాను,
నువ్వు నిద్రపో! అని పిల్లవాణ్ణి నిద్రబుచ్చుతుంది తల్లి. కొంత సేపటికి పిల్లవాడు నిద్ర పోతాడు. అంతే. చేతిలోని రూపాయి బిళ్ళ చేజారి క్రింద పడుతుంది.
భార్య భర్తను పిలిచి, రండి! ఇదిగో మీ రూపాయి బిళ్ళ. తీసుకోండి! పడేసుకుంటాడు అంటూ పిల్లవాడికన్నా ఎక్కువగా గోల చేశారు. ఇష్టమైన దానిని ఎవరు పడేసుకుంటారు? పడేసే సమయం వచ్చి నప్పుడు ఎవరు ఉంచు కుంటారు? అంటుంది తల్లి. అడిగినా ఇవ్వని పిల్లవాడు నిద్ర లోకి జారుకోగానే రూపాయి బిళ్ళ దానంతటదే చేజారి పోయింది. భక్తులూ అంతే. అనన్య భక్తిలో మనస్సు తన్మయం చెందగానే, ప్రపంచం అప్రయత్నంగా మనస్సు నుండి జారి పోతుంది. అన్య చింతలు పారి పోతాయి. అదే అనన్య భక్తి. అన్యాశ్రయాణాం త్యాగః అనన్యతా - అన్య ఆశ్రయాలను విడిచి పెట్టి, పరమేశ్వరునే హృదయంలో ఉంచుకోవడం అనన్యత అని వ్యాఖ్యానించాడు నారదమహర్షి.
అనన్య భక్తి వల్ల భక్తుని హృదయంలో సదా భగవంతుడే ఉంటాడు. అంటే, భక్తులు కాని వారి
హృదయాలలో భగవంతుడు లేడా? భగవంతుడు అందరి హృదయాలలో ఉన్నాడు. ఉంటాడు
(18 వ అ - 61వ శ్లో). కాని, భగవంతుడు హృదయంలో ఉన్నాడని అభక్తునికి తెలియదు. భక్తునికి తెలుసు. అదే తేడా.
భక్తుని హృదయంలో భగవంతుడు ఉన్నాడు కనుక, భక్తుడు నిర్భయుడు. ఏ అవసరాలూ లేనివాడు. ప్రతికూలాలు అర్థం కాని వాడు. భక్తుని అవసరాలు భగవంతుని అవసరాలుగా మారాయి. భక్తుని అనన్య చింతనము బ్రతుకులో సర్వ చింతలను దూరం చేసింది. భక్తి భగవంతుణ్ణి భక్తుని అధీనంలో ఉంచుతుంది. భక్తుడు సదా అనన్య భక్తిలో తృప్తి చెందుతూ ఉంటే, భక్తుని అవసరాలను భగవంతుడే చూసుకుంటూ ఉంటాడు. భక్తుని అవసరాలను చూడటం తన బాధ్యతగా భగవంతుడే స్వయంగా ప్రకటించు కున్నాడు కదా!
(యోగక్షేమంవహామ్యహం).యోగ క్షేమాలు ప్రాప్తించని దానిని పొందడం యోగము (అప్రాప్తస్య ప్రాపణం యోగః). ప్రాప్తించిన దానిని పరిరక్షించుకోవడం క్షేమము (క్షేమః తద్రక్షణమ్). బిడ్డ అవసరాలు తల్లికి తెలిసినట్లు, భక్తుని అవసరాలు భగవంతునికి తెలుసు. బిడ్డ అవసరాలను బిడ్డ అడగక పోయినా తల్లి ఎలా తీరుస్తుందో, భక్తుని అవసరాలను కూడా భక్తుడు అడగక పోయినా భగవంతుడే తీరుస్తాడు. బిడ్డ బిడ్డగా ఉండటమే తల్లి ప్రవర్తనకు కారణము. భక్తుడు భక్తుడుగా ఉండటమే భగవంతుని ప్రవర్తనకు కారణము. బిడ్డ తల్లిని బంధించినట్లు భక్తి భగవంతుణ్ణి కట్టి పడేస్తుంది.
ప్రతి ఒక్కరి జీవితంలో యోగక్షేమాలే ప్రధానంగా ఉంటాయి. ఎవరు ఏది ఆలోచించినా, ఏ పని చేసినా యోగక్షేమాల చుట్టే తిరుగుతూ ఉండటం స్పష్టంగా తెలుస్తుంది. నాకు లేనిది - నాకు ఉన్నది, ఇవే ప్రధానమైన విషయాలుగా ఉంటాయి. కొందరు లేమితో కలవర పడుతూ ఉంటే, కొందరు కలిమితో కుములుతూ ఉంటారు. లేనివి ఒక విధంగా వేధిస్తే, ఉన్నవి మరొక విధంగా బాధిస్తూ ఉంటాయి.
నాకు ఆదాయం లేదు, ఆరోగ్యం లేదు. ఉద్యోగం లేదు, సంతానం లేదు, శాంతి లేదు.
ఇల్లు లేదు పెళ్ళి లేదు, జ్ఞానం లేదు- ఇలా లేని వాటిని తలచుకుంటూ కొందరు బాధ పడుతూ ఉంటారు. అలా లేని వాటిని పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఏవేవి ఎవరికి లేవో వాటిని వారు పొందడం యోగం అవుతుంది (అప్రాప్తస్య ప్రాపణం).
కొందరికి ఉన్నవి కొన్ని పోతూ ఉంటాయి. మరి కొన్ని పోతాయేమో అని మనస్సు హెచ్చరిస్తూ ఉంటుంది. ఒత్తుగా ఉన్న జుట్టు క్రమేపి రాలిపోతూ ఉందని కొందరు బాధపడుతూ ఉంటే, బ్యాంకులో నిల్వ చేసిన ధనం
మెల్లగా తరిగిపోతూ ఉందని మరి కొందరు ఆవేదన చెందుతూ ఉంటారు. ఆరోగ్యం క్షీణిస్తూ ఉందని కొందరు అలమటిస్తూ ఉంటే, ఇక ముందు క్షీణిస్తుందేమో అని ఊహించుకొని కొందరు కలత చెందుతూ ఉంటారు. ఉన్న ఉద్యోగం ఊడుతుందేమో, అకాల వర్షాలు పడి చేతి కొచ్చిన పంట చేజారి పోతుందేమో! ఇలా ఉన్నవి లేకుండా పోతాయేమో అని కొందరు వ్యథ చెందుతూ ఉంటారు. ఉన్న వాటిని పోకుండా కాపాడుకొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే రక్షణము (ప్రాప్తస్య రక్షణం క్షేమః). అదే క్షేమము.
అందరూ ఈ విధమైన యోగక్షేమాల వ్యవహారంలో పడి తల మునకలై ఉంటే, భక్తుడు యోగక్షేమాల
విషయంలో స్పృహ లేనివాడై ఉంటాడు. ఈ విధమైన నిస్పృహకు ప్రధానంగా రెండు కారణాలు కనబడతాయి. (1) ఏవేవో పొందాలి అనే ఆశ లేకపోవడము (2) మరేవో దూరమౌతా యనే నిరాశ ఉండక పోవడము. భగవంతుడు లేనపుడు ఏది ఉండి ఏమి ప్రయోజనం? అని తనను తాను భక్తుడు ప్రశ్నించు కుంటాడు. అంతే కాదు. భగవంతుడు ప్రాప్తించి నపుడు, అంతకన్నా పొంద వలసింది ఏముంటుంది? అని తనను తాను ప్రశ్నించుకొని సమాధానం పొందుతాడు. తృప్తి చెందుతాడు. సదా తన హృదయంలో భగవంతుని దర్శించుకుంటూ భక్తిలో పరవశించే భక్తునికి ఏవో లేవు అనే యోగానికి సంబంధించిన ఆరాటము ఉండదు.
ఉన్నవి పోతాయేమో అనే క్షేమానికి సంబంధించిన ఆవేగమూ లేదు. ఈ విధంగా యోగక్షేమాలను భక్తుడు త్యజించడం చేత, సదా అనన్య భక్తితో తనను ఆరాధించే భక్తుని యోగక్షేమాలను వహించ వలసిన బాధ్యత పరమేశ్వరునిది అయింది.
యతస్తదీయాః ఈ కారణం చేత భక్తులు భగవంతునికి సంబంధించిన వారయ్యారు. భగవంతునితో
నిత్య సంబంధాన్ని కలిగిన వారయ్యారు. తమ అనన్య భక్తి చేత భక్తులు భగవంతునికి ముఖ్యు లయ్యారు (భక్తాః ఏకాంతినో ముఖ్యాః). అనన్య భక్తి కలిగిన ఏకాంత భక్తులను గూర్చి నారద మహర్షి విశేషంగా వ్యాఖ్యానించాడు.
భక్తులు సదా పరమేశ్వరుని యందే మనస్సును లగ్నం చేసి ఉంటారు కనుక, వారికి అనిత్యమైన
ప్రాపంచిక విషయాలతో సంగత్వం ఉండదు (సంగం త్యజతి). మనస్సును ఖాళీ చేసుకొని, మాధవుని చేతిలో మురళి లాగా భక్తులు పనిముట్లుగా మారుతారు కనుక కర్తృత్వము లేనివారై ఉంటారు. కర్తృత్వము లేనందున కర్మఫలాల యందు దృష్టి లేనివారై ఉంటారు (కర్మఫలం త్యజతి). మురళి ద్వారా అద్భుతమైన రాగాలను పలికించినట్లు, తన చేతిలో పరికరాలుగా మారిన భక్తుల ద్వారా పరమేశ్వరుడు అసమానమైన, అనితర సాధ్యమైన కార్యాలను ఆవిష్కరిస్తాడు. తన ద్వారా ఏ రాగం పలికినా, అందులో పరమేశ్వరుని వైభవాన్నే మురళి వీక్షించినట్లు, తమ ద్వారా ఎంతటి మహత్తరమైన కార్యాలు జరిగినా, అవన్నీ భగవదనుగ్రహ ప్రసాదాలుగా భక్తులు భావిస్తారు.
ద్వంద్వాలను దాటి పోతారు (నిర్ద్వన్ద్వో భవతి). ఈ విధమైన ఏకాంత భక్తి ప్రాప్తించగానే భక్తుడు యోగ క్షేమాలను మరచి పోతున్నాడు. వాటిని దాటి పోతున్నాడు (యోగ క్షేమం త్యజతి). మరి యోగక్షేమాలను కూడా పట్టించుకోకుండా భక్తుడు భగవత్సేవలో పరవశించి ఉంటే, అట్టి భక్తుని యోగక్షేమాలను ఎవరు చూస్తారు? ఎవరో ఎందుకు చూస్తారు? భక్తుడు భగవంతుని కార్యంలో నిమగ్నమై ఉన్నాడు కనుక, భక్తుని యోగక్షేమాలను భగవంతుడే చూడాలి. చూస్తాడు. అదే చెబుతున్నాడు. నిత్యాభియుక్తు లైన భక్తుల యోగక్షేమాలను నేనే చూసుకుంటాను (తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్).
బాలకృష్ణుడు ఊయలలో ఆదమరచి నిద్రిస్తున్నాడు. అందంగా, అమాయకంగా నిద్రిస్తున్న చిన్ని కన్నయ్య మోమును అదే పనిగా వీక్షిస్తూ యశోదమ్మ పరవశిస్తూ ఉంది. ఈ లోగా ఏదో కలవరిస్తూ బాలకృష్ణుడు ఉలికిపడి కళ్ళు తెరిచాడు. తన బిడ్డకు ఏదో పీడ కల వచ్చి ఉంటుందని భావించి యశోద దిష్టి తీస్తుంది. పుత్ర వాత్సల్యంతో బిడ్డకు తల్లి దిష్టి తీసిందే గాని, తన బిడ్డ మామూలు బిడ్డ కాడని, ప్రపంచానికే తండ్రి యని, ఆయనది ఉలికిపాటు కాదని, భక్తులను తలచుకొని ఆనందించే అలవాటు అని యశోద గ్రహించలేక పోయింది. కన్నయ్య కలవరం లోని కారుణ్యాన్ని దర్శించిన చైతన్య హృదయం భక్తి ప్రేమలతో ఒక వెన్నముద్దను సమర్పించుకుంది.
కలల మత్తులో ఉలికి పడితి వేల? ఎవరు పిలిచారు కల లోన తొంగి చూచి
కలకాలము కూడ భక్తుల మెలకువేనా! నీ అడుగుల కడ పడి ఉందు చిన్నికృష్ణా!
అని చిన్నికృష్ణ శతకంలో ఒక వెన్నముద్ద. కలకాలము భక్తులను కనిపెట్టుకొని, యోగక్షేమాలను నిర్వర్తించే పరమేశ్వరుడు, కల గనే కాలంలో కూడా భక్తుల వ్యవహారాలనే చక్కబరుస్తూ ఉంటాడు. ఈ ధైర్యం తోనే భక్తులు సదా భగవంతుని సేవలో తృప్తి చెందుతూ ఉంటారు.
ఆఖ్యాయిక
కొన్ని శతాబ్దాల క్రితం పండరీపురంలో ఒక భక్తుని జీవితంలో జరిగిన వాస్తవ సన్నివేశము. అనన్య
భక్తితో పరమేశ్వరుని సేవిస్తే, యోగక్షేమా లన్నీ పరమేశ్వరుడే చూసుకుంటాడు అనే ఈ శ్లోకం విషయంలో ఆ భక్తునికి ప్రగాఢమైన విశ్వాసము. ఆయన విశ్వాసానికి అనుగుణంగానే జీవితం కూడా సజావుగా సాగుతూ ఉండింది.
నిరంతరము భగవద్గుణ శ్రవణ కీర్తనాదులతో భక్తుడు కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఏదో ఓ విధంగా
అవసరాలు తీరుతూ ఉండేవి. ఆశలులేని ఆ భక్తుని కుటుంబం అదుపు పొదుపు తెలియకుండా, కుదుపు లేకుండా సాగుతూ ఉండింది.
ఒక కాలంలో ఆ ప్రాంతం తీవ్ర క్షామానికి గురైంది. కరువు కాటకాలతో జన జీవనం కుంచుకు పోయింది. భక్తుని ఇంట్లో పూట గడవటం కష్టసాధ్య మైంది. ఆకలితో భార్యా పిల్లలు అలమటించి పోతున్నారు. పరిస్థితి విషమించింది. అయినా భక్తుడు అనన్య భక్తి లోనే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. భగవంతుని మాట వమ్ము కాదని అతని ప్రగాఢ విశ్వాసము.
రెండు రోజులు వరుసగా ఆహారం లేకపోయే సరికి బిడ్డలు శోషించి పోయారు. ఏమి చెయ్యాలో తోచక
భార్య భర్తను సమీపించింది. బిడ్డల దయనీయ పరిస్థితిని వివరిస్తూ భోరున విలపించింది. పిల్లల్ని రక్షించమని ప్రాధేయ పడింది.
భార్య ఆక్రందనము చూచి భక్తుడు చలించి పోయాడు. ఆమె సలహా ప్రకారము ఎవరినైనా యాచించి, సరుకులు తీసుకొని వద్దామని బయలుదేరాడు. పోతూ పోతూ, క్షణం ఆగి వెను దిరిగి పూజా మందిరం లోకి వెళ్ళాడు.
పాండురంగని ప్రతిమను తదేకంగా చూశాడు. దుఃఖం కట్టలు త్రెంచుకుంది. ఏదో వ్రత భంగం జరిగి
పోతున్నట్లు మనస్సు విలవిల లాడింది. ఎవరో గుండెను పిండినట్లైంది. 'పండరినాథా! పాండురంగా! నీ మాట మీద అకుంఠితమైన విశ్వాసంతో ఇంతవరకు జీవితాన్ని కొనసాగించాను. అనన్య భక్తితో జీవించాను. యోగక్షేమాలు నీవే చూసుకుంటా నన్నావు. క్షామంలో పడేసి వినోదం చూస్తున్నావు' అని అభియోగిస్తూ, పూజాపీఠం వద్ద తెరచి ఉంచిన భగవద్గీత తాళపత్ర గ్రంథాన్ని చూశాడు. తెరచి ఉన్న ఆ పత్రంపై దృష్టి సారించాడు.
అది తొమ్మిదవ అధ్యాయం - ఇరవై రెండవ శ్లోకం. అనన్యాశ్చింత యన్తో మాం అనే ఆ శ్లోకాన్ని చూడగానే బాధ రెండింత లైంది. గుండె ముక్కలైంది. 'ఈ శ్లోకం తప్పు. ఇది విశ్వసించదగింది కాదు' అనుకుంటూ, ఒక ముల్లు తీసుకొని ఆ శ్లోకంపై అటు ఇటు గీకి పడేశాడు. తాళపత్రమే కనుక అది చిరిగి పోయింది. అంతే, ఇక అరువు తోనే కరువు తీరాలనుకుంటూ బరువైన హృదయంతో గ్రామంలోకి వెళ్ళాడు.
భక్తుడు వెళ్ళిన కొంత సేపటికి ఒక పిల్లవాడు రెండు భుజాలకు రెండు బరువైన సంచులను
తగిలించుకొని, తలపై ఒక మూట నుంచుకొని, దానిని తన చిన్ని చేతులతో భద్రంగా పట్టుకొని తడబడుఅడుగులతో ఇంటికి వచ్చాడు. ఆ సరుకుల మూటలను దించి భక్తుని భార్యకు అప్ప చెప్పి, అయ్యగారు ఇవి మీకు ఇవ్వ మన్నారు అన్నాడు.భార్య ఆశ్చర్య పోయింది. ఈ లోగా సరుకులు తెచ్చిన పిల్లవాడు వెళ్ళొస్తానంటూ వెను దిరిగాడు. ఆ పిల్లవాడి వీపుపై రక్తం కనిపించింది. ఎవరో బలంగా గీకినట్లు ఉంది. కలత చెందిన ఆ ఇల్లాలు, 'నాయనా! అదేమిటి? ఆ రక్త మేమిటి? ఎవరు అలా చేసింది? ఇంతకీ నువ్వెవరు?' అంటూ ప్రశ్నలు సారించింది.
‘అమ్మా! నా పేరు రంగడు. నేను పనులు చేసుకుంటూ బ్రతుకుతుంటాను. మీ వారు మా శేఠ్ వద్ద ఈ
సరుకులు తీసుకొని, తొందరగా మీకు ఇచ్చి రమ్మని నన్ను ఆజ్ఞాపించారు. నేను బయలుదేరడంలో కొంత ఆలస్య మైందని ఆగ్రహించి, అక్కడే ఉన్న ముల్లుకర్రతో నన్ను కొట్టారు. ఆ ముల్లు గీసుకుని రక్తం వచ్చింది. అంతే' అన్నాడు ఆ బాలుడు.
'అయ్యో! ఎంత తొందర అయితే మాత్రం పసిబిడ్డను ఇలా కొట్టడమా? ఉండు నాయనా! కాస్త తుడిచి
మందు వేస్తాను' అని ఆమె లోపలి కెళ్ళింది. ఆమె తిరిగి వచ్చే లోగా బాలుడు తిరోహితు డయ్యాడు.
ఇల్లాలు మూటను విప్పి చూచింది. అందులో కుటుంబము లోని వారందరికి బట్ట లున్నాయి. కొన్ని నగలున్నాయి. కొంత నగదు కూడా ఉంది.
సంచులలో చూస్తే వంట సరుకులు పుష్కలంగా ఉన్నాయి. ఆశ్చర్య పోయిన ఆ తల్లి వెంటనే షడ్రసోపేతమైన పాకం చేయడానికి సిద్ధమై చకచకా చేస్తూ ఉంది. ఈ లోగా దీన వదనుడై ఇంటి వైపు వస్తున్న భర్తను చూచి, పరుగు పరుగున ఆయనను సమీపించింది.
ఆమెను చూడగానే భర్త కన్నీళ్ళను ఆపుకోలేక పోయాడు.
Comments
Post a Comment