సనాతన సౌరభాలు గ్రంధం నుండి

సనాతన సౌరభాలు గ్రంధం నుండి 1. మరణించిన తరువాత జీవుని స్థితి 2. పితృకర్మల గురించిన వివరణ మరణం తరువాత జీవాత్మ పరిస్థితి ఈ లోకంలో ప్రతీమనిషి శాశ్వతంగా ఉండిపోతాననే అనుకుంటాడు. పుట్టిన క్షణం నుండి ప్రతిక్షణము తన ఆయుషు తగ్గుతునే ఉంటుందని తెలియదు, వేసే ప్రతి అడుగు మృత్యువు వద్దకే అని తెలియదు. తనకు ఉన్నnఆయుర్దాయం ఎంతో తెలియదు. కుటుంబము, సంసారము అంటూ బంధాలు, అనురాగాలు పెంచుకుంటూనే ఉంటాడు, అకస్మాత్తుగా మరణం సంభవించేసరికి జీవాత్మ తట్టుకోలేకపోతుంది. శరీరంలో జీవం పోగానే దానిని భౌతికకాయం అంటారు. జీవాత్మ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించే ప్రయత్నాలు చేస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను అని అరుస్తుంది. జీవాత్మకు తన భౌతికకాయం వద్ద రోదిస్తున్న వారందరూ కనిపిస్తుంటారు. వారి రోదనలు వినిపిస్తుంటాయి. కాని వాళ్ళకు జీవాత్మ కనిపించదు, జీవాత్మ గోడు వినిపించదు, అంతిమ ప్రయాణం మొదలవగానే జీవాత్మకు దుఃఖం ఆగదు. తనదేహం నాశనమయే సమయం సమీపిస్తుందని రోదిస్తూ భౌతికకాయంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. దహనం లేక ఖననం జరిగిన తరువాత జీవాత్మ ఇంటికే వచ్చేస్తుంది. పెద్దకర్మ అయిన వరకు ఇంటిలోనే ఉండి తను జీవించినంతకాలం ప్రేమించి పోషించినవారు తన పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూసి హతాశుడవుతుంది. ఇటువంటి వారి కోసమా ఇన్నాళ్ళు పాటుపడింది అని విచారిస్తుంది. మన సాంప్రదాయాల ప్రకారంగా చేయబడిన అపరకర్మ విధులు ఆ జీవాత్మను యమలోకము తరువాత నున్న వైతరణీ నదిని దాటించి స్వర్గములో ప్రవేశించే సంకల్పముతో శ్రద్ధగా నిర్వహించాలి. అది అందరి బాధ్యత. అంతిమ యాత్ర జరుగుతున్నప్పుడు శవాన్ని చూసి చీదరించుకోవడము, అసహ్యించుకోవడము చేయకూడదు. ఆ జీవాత్మకు శాంతి కలగాలి, ఉత్తమ గతులు కావాలి అని ప్రార్థించాలి. వేరే విధంగా ప్రవర్తించి దుఃఖంలో ఉన్న జీవాత్మ దృష్టిలో పడి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టుకోకూడదు. పితృదేవతల ఆరాధన| మన విశ్వాసం ప్రకారము జీవితం అంటే కేవలం జీవించి ఉన్నప్పటికే పరిమితమయ్యేది కాదు. మరణం తరువాత కూడా జీవితము ఉంటుంది. నిన్నటి వరకు మనలానే మానవరూపములో మన మధ్య జీవించిన తల్లితండ్రులూ, యితర పెద్దలూ మరణం అనంతరము దైవత్వము పొందుతారు. వారినే 'పితృదేవతలు' అంటారు. తమ సంతానము తమకు చేయవలసిన విధులన్నీ సక్రమముగా చేస్తుంటే, వారు యెంతో సంతోషముతో ప్రసన్నులై కోరుకున్న వరాలన్నీ ప్రసాదిస్తారు. చనిపోయిన వారికి పితృలోకము పేరుతో ప్రత్యేకమైన లోకము ఉంటుందని చెప్పడము మన సాంప్రదాయంలో గమనించదగిన విశేషము. వారిని ఉద్దేశించి చేసే కర్మను 'శ్రాద్ధం' అంటారు. అలా అనడములో కూడా యెంతో అర్ధము ఉంది. శ్రాద్ధము అంటే శ్రద్ధతో చేయవలసినది. ఎంతో పవిత్రముగా నిర్వర్తించవలసినది. పితృదేవతల కోసము చేసే విధులనే శ్రాద్ధమన్నారంటే దానికి విశేష ఫలితాలు ఉంటాయి. జీవుడు దేహము విడిచి మళ్ళీ తల్లి గర్భములోనికి ప్రవేశించేవరకు కొంత శుద్ధి జరగవలసి ఉంటుంది. అప్పుడే ఆ జీవి ఉత్తమ జన్మను పొందుతాడు. అదే శ్రాద్ధ కర్మ. పుశ్కరాలలో శ్రాద్ధకర్మ ఒక ముఖ్యభాగము. శరీరము ఏర్పడడానికి కారణము మనము చేసిన పూర్వకర్మల ప్రభావమే. ముందు జన్మలో మన మనసును బలముగా అంటి పెట్టుకొని ఉన్న మంచిచెడు లక్షణాలన్నీ తర్వాతి జన్మకు కూడా సంక్రమిస్తాయి. చెడు లక్షణాలను తొలగించి శుధ్ధి చేయడానికే శ్రాద్ధకర్మ ఉపయోగపడుతుంది. మందు వేస్తే రోగము పోయినట్టే పాపకర్మలు కూడా శ్రాద్ధకర్మను పద్ధతిగా ఆచరిస్తే నాశనము అవుతాయి. (ఆగష్టు 2003, కుముదం స్పెషల్) పితృదేవతలు అమరులే పితృదేవతలు అందరూ అమరులవంటివారే ! అయితే దేవతలు ఉత్తర దిశలో నివసించుచున్నారు. పితరులు దక్షిణ దిశలో తమ నివాసమును యేర్పరచుకున్నారు. పరమపదించిన బంధువులకు అతిభక్తితో శ్రాద్ధకర్మలు ఆచరించి నందువల్ల పితరులకు అమిత ఆనందము కలుగుతుంది. అందువల్ల పితృదేవతలు శ్రాద్ధకర్మలు ఆచరించిన వారికి అందరికి ఐహిక సుఖాలే కాక ఉత్తమమైన పుణ్యగతిని ప్రసాదిస్తున్నారు. మానవులకే కాక సుర, అసుర, గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషాదులు అందరికి పితృదేవతలు పూజనీయులే ! శ్రాద్ధ కర్మలు తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవడం కోసమే మాసికాలు, ఆబ్దికాలు నిర్దేశించబడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరంలోపు ప్రతీ నెలా వారికి వారు మరణించిన తిధినాడు జరిపించేదే మాసికం. ఆబ్దికం అంటే ప్రతీ సంవత్సరం ఏ తిధినాడు వారు మరణించారో ఆ తిధినాడు జరిపించేదే ఆబ్దికం. అంటే నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రీయంగా జరిపించడం మన విధి. అంటే మనం ఆ తిధినాడు అందించిన ఆహారాదులు (పిండప్రదానం) మాసికం అయితే నెల వరకు, ఆబ్దికం సంవత్సరీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని శాస్త్ర వచనం. పితృదేవతలను ఉద్దేశించి చేసే కర్మలను శ్రాద్ధ కర్మ అంటారు. అంటే శ్రద్ధతో చేయవలసింది అని అర్ధము. మనము శ్రాద్ధ కర్మలు చేయునపుడు పితృదేవతలు వాయు రూపమునవచ్చి భోజనమును స్వీకరించెదరు. సంక్రాంతినాడు పితృకర్మలు జన్మనిచ్చి పోషించి, పెంచి, తప్పటడుగుల దగ్గఱనుండి తప్పు అడుగుల వరకు సరిదిద్ది, పెద్దజేసి, విద్యాబుద్ధులు నేర్పించి, మనల్ని మనుషులుగా సమాజంలో నిలబెట్టిన తల్లితండ్రులు మరణించిన తరువాత వారికి శ్రాద్ధకర్మలు తప్పనిసరిగా చేయాలా? అంటే చేయాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలవారు ప్రతీ సంవత్సరము తల్లిదండ్రులు మరణించిన తిధుల ప్రకారం సంవత్సరీకాలు పెడుతుంటారు. శూద్ర వర్ణాలవారు ఎక్కువగా సంక్రాంతికి పెద్దలను స్మరించుకొని బట్టలు పెట్టేవారు. కాని ఇప్పుడిప్పుడు వారిలో చాలామంది అవగాహనతో పెద్దల తిధులబట్టి పితృకార్యాలు చేస్తున్నారు. ఇది శుభపరిణామం! సంక్రాంతికి పెద్దలను స్మరించుకొని పూజించుకోవడం ఎందుకంటే - సూర్యుడు మకరరాశిలోనికి ప్రవేశించేది పుష్యమాసంలో కాబట్టి ! ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఇపుడే ప్రారంభమౌతుంది. కనుక ఇప్పుడే స్వర్గదారాలు తెరుస్తారనీ, మరణించినవారికి ఈ పుణ్యకాలంలో స్వర్గప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. స్వర్గద్వారాలు తెరిచే సమయంలోనే సంక్రాంతి వస్తుంది. కాబట్టి భోగినాడు పితృదేవతలను పూజించే సాంప్రదాయం వచ్చింది. మాతా పితృ కర్మలు - మన కోసం భగీరధుని కధ మనకు తెలుసును. తన పూర్వికులు పుణ్యలోకాలకు వెళ్ళలేక అల్లల్లాడడము చూసి తపస్సు చేసి గంగను భూలోకానికి తెచ్చి, తనపితృదేవతల మీదుగా గంగను ప్రవహింపజేసి వారికి పుణ్యలోక ప్రాప్తి కలిగించాడు. మనమూ మరణించిన తల్లిదండ్రులతో పాటు పితృదేవతలకు శ్రాద్ధకర్మలను సక్రమంగా ఆచరించకపోతే మనం మరణించిన తరువాత మన ఆత్మలకూ పుట్టగతులు ఉండవు. (- సాధకుడు) మానవుల - పితృదేవతల దేవతల కాలమానము మానవుల యొక్క శుక్లపక్షము (పాడ్యమి నుండి పౌర్ణమి వరకు) పితృదేవతలకు ఒక పగలు, కృష్ణపక్షము (పాడ్యమి నుండి అమావాస్య వరకు) ఒక రాత్రి, అనగా మానవులకు ఒక మాసము పితృదేవతలకు ఒక దినము అగును. అందుచేతనే ప్రతీ అమావాస్య నాడు పితృతర్పణము, పిండ ప్రదానము చేయుటకు కారణము. మరణించిన పిదప ఒక సంవత్సరము వరకు ప్రతీ నెలా అమావాస్య నాడు చేసిన పితృతర్పణము పితృదేవతలకు నిత్యమూ (ప్రతీదినము) అన్నమిడినట్లుండును. మానవుల యొక్క ఉత్తరాయణపు ఆరు మాసములు దేవతలకు ఒక పగలు, దక్షిణాయణపు ఆరు మాసములు ఒక రాత్రి. అనగా మానవులకు ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దినము. అందుచేతనే సంవత్సరమునకు ఒక పర్యాయము ఉత్సవములు జరుపుతున్నారు. ఆ విధముగా చేయుట వలన దేవతలకు నిత్యము (ప్రతీ దినము) పూజలు జరిపించినట్లుండును. ఆర్శ విజ్ఞాన విశిష్టత విశ్వేదేవతలు: పూర్వము దక్షుని పుత్రిక, ధర్మదేవుని యొక్క పత్ని అయిన 'విశ్వ' యొక్క గర్భము నుండి - క్రతు, దక్ష, సత్య, వసు, ధూలీ, రచన, పురూరవ, ఆర్థృవ, కాల, కామ అను పదిమంది పుత్రులు జన్మించిరి. వీరినే “విశ్వే దేవతలు” అందురు. వీరు పెరిగి పెద్దవారు అయిన తరువాత హిమాలయములకు పోయితపస్సు ప్రారంభించిరి. వీరి ఉగ్ర తపస్సునకు పితృదేవతలు, బ్రహ్మ కూడా ప్రత్యక్షమయి వరము కోరుకోమనగా విశ్వేదేవతలు - మానవులు పితరులకు పెట్టు శ్రాద్ధములందు మాకు భాగము కావలెనని కోరుకొనిరి. బ్రహ్మ, పితృదేవతలు అదే విధముగా వరము నిచ్చిరి. అది మొదలు ఈ విశ్వే దేవతలు శ్రాద్ధ భాగమును పొంది శ్రాద్ధమును రక్షించుచూ అన్నాది పదార్ధములను పితరులకు అందించుచూ ఉండిరి. ఈ విశ్వే దేవతల యొక్క సహాయముతో పితృ పితామహులు శ్రాద్ధములో అర్పించబడిన వస్తువులను గ్రహించి తృప్తి పొందుదురు. కాబట్టి యీ విశ్వేదేవతలను శ్రాద్ధకాలములో తప్పక పూజించి శ్రాద్ధకర్మను సఫలముచేసుకొనవలెను. (- బ్రహ్మాండ పురాణము, చతుర్వర్గ చింతామణి గ్రంధములు -సప్తగిరి ఆగష్టు 1994)

Comments

Popular posts from this blog

పాలకుల కుట్రలపై త్యాగాల విజయం ..సిరికొండ మధుసూదనాచారి

సుందర సత్సంగము

కలికి కళ్ళెం వేయండి