కలికి కళ్ళెం వేయండి

కలికి కళ్ళెం వేయండి 
ఇది కలియుగం..... ఆకలి యుగం..... కల్మషాలకు నిలయం. బాహ్యంలో వాతావరణ కాలుష్యం - ఆంతర్యంలో అధర్మ కాలుష్యం. బాహ్యంలో యంత్రాలు.... ఆంతర్యంలో కుతంత్రాలు. అంతా కాలుష్యాలే... కాపట్యాలే. భాగవతం ప్రవచించినట్లు కలిపురుషుడు విజృంభించాడు. కలికి కళ్ళెం వేయడమే మన ప్రధాన కర్తవ్యం. ధర్మం నశిస్తూవుంది. దయ అగోచరమైంది. న్యాయం నీరసించి పోయింది. మోసం అడుగడుగునా మకాం పెట్టింది. మంచితనం అడుగంటింది. సత్యం సడలిపోయింది. అహింస హడలిపోయింది. కులతత్వాలు పెచ్చుపెరిగాయి. అబద్ధాలు అందల మెక్కాయి. అరాచకాలు పాలిస్తున్నాయి. ఎక్కడ చూసినా....... హత్యలు, దోపిడీలు..... దగాలు, మారణహోమాలు... ఆకలికి అలమటించేవారు... శవాలతో క్రీడించేవారు.... ఎక్కడికి పోతూవుంది ఈ ప్రపంచం ? ఏమిటి దీనికి ఏకైక తరుణోపాయం ? మొన్నటి బొంబాయి ప్రేలుళ్ళతో చెవులు మూసుకు పోయాయి. నిన్నటి మరాట్వాడా భూకంపంతో కళ్ళు తిరుగుతున్నాయి. ఈ కలికి కళ్ళెం వేయాలి…ఈ కుళ్ళును కడిగి వేయాలి. ఏంచేయాలి ? ఎవరు చేయాలి ? ఒక్కటే చేయాలి.......మనమంతా కలిసి చేయాలి. నోరారా భగవన్నామం చేయాలి. కలియుగము ప్రబల దోషయుత మైనను దాని నివారణము కూడా కలియుగము నందే కలదని శుకమహర్షి భాగవతంలో పరీక్షిన్మహారాజుకు చెబుతాడు. కలి దోషముల నన్నింటిని భగవన్నామము హరిస్తుందని ప్రవచిస్తాడు. "ఓం నమో భగవతే వాసుదేవాయ” ఈ పవిత్ర మంత్రం కలి దోషాలను హరిస్తుంది. వాతావరణాన్ని శుద్ధిచేస్తుంది. బుద్ధిని శుద్ధి పరుస్తుంది. మనసులోని మాలిన్యాన్ని తొలగిస్తుంది. హృదయాన్ని తేలిక పరుస్తుంది. హరిః సదా వసే త్తత్ర యత్ర భాగవతా జనాః గాయన్తి భక్తి భావేన హరేర్నామైన కేవలమ్ భక్తులు గుమిగూడి ఎచ్చట హరినామమును గానము చేయుచుందురో అచ్చట శ్రీ హరి వసించుచుండును. నామమున్నచోట నారాయణుడుంటాడు. నామము మనకు నామిని ప్రసాదిస్తుంది. స్వామిని ప్రసాదిస్తుంది. నారాయుణుడున్నచోట నరకముండదు. జనార్దననామంతో జగడాలు దూరమౌతాయి. హరినామంతో హత్యలు అదృశ్యమవుతాయి. కృష్ణనామంతో తృష్ణ నశిస్తుంది. రామనామంతో కామం పలాయనమౌతుంది. భవరోగాలకు భీతి చెందకండి. భగవన్నామం భయాలను భయ పెడుతుంది. వాతావరణ కాలుష్యం పోవాలా ? ఇంటి చుట్టూ తులసి మొక్కలు పెంచండి. ఆంతర్య కాలుష్యం తొలగాలా ? అచ్యుతుని నామాన్ని గానం చేయండి. ఏ కులంవారైనా చేయవచ్చు. ఏ మతం వారైనా చేయవచ్చు. కుళ్ళు సృష్టించిన కులాలు కుళ్ళిపోనీ. ముళ్ళు పరచిన మతాలు మరలిపోనీ. కులాలు మనకొద్దు. అనుకూలమే మన కులం...... మతాలు మనకొద్దు. సమ్మతమే మన మతం....... నవ సమాజ నిర్మాణానికి నడుం కట్టండి. కలి పురుషుని ఆగడాలకు కళ్ళెం వేయండి. మంచితనానికి మనిషితనానికి శుభ పరిణామం ఈ సమయం. కలసికట్టుగా నామం చేద్దాం ప్రభునామానికి లేదు నియమం..... బుధజన సేవలో,,,,,, సుందర చైతన్యాశ్రమం ధవళేశ్వరం గాంధీ జయంతి 2-10-'93

Comments

Popular posts from this blog

పాలకుల కుట్రలపై త్యాగాల విజయం ..సిరికొండ మధుసూదనాచారి

సుందర సత్సంగము