నమస్తే తెలంగాణ ఆచరించి, ఆదర్శంగా నిలిచి.. సిరికొండ మధుసూదనాచారి

నమస్తే తెలంగాణ 01 october 2023 ఆచరించి, ఆదర్శంగా నిలిచి.. సిరికొండ మధుసూదనాచారి (ఎమ్మెల్సీ, తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు) ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలు, కార్యక్రమాలను రూపొందించడంలో కేసీఆర్ సర్కార్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. కుల వృత్తిదారులు, బడుగు వర్గాల స్వయం ఉపాధికి బీసీ బంధు, దళిత బంధు లాంటి పథకాలను అమలు చేస్తున్నది. పర్యావరణం, గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించి మెరుగైన ఫలితాలను సాధించింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ వ్యవస్థకు సాంకేతిక హంగులుఅద్దింది. హైదరాబాదు అంతర్జాతీయ కంపెనీలకు కేంద్రంగా తీర్చిదిద్ది ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంచింది. బీ సీ బంధు పథకం ద్వారా అర్హులైన వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కుల వృత్తిదారుల జీవనోపాధికి గొర్రెలు, చేపలు ఉచితంగా పంపిణీ చేస్తున్నది. తరతరాలుగా సంపద సృష్టిలో ముందుండి అసమానతలు, అవమానాలు ఎదుర్కొన్న దళిత జాతిని పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా తీర్చిదిద్దడానికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. పరిపాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాలను తెలంగాణ సర్కారు ఏర్పాటుచేసింది. గూడేలను, గిరి తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది. దీంతో వేలాది మంది గిరిజనులు ప్రజా ప్రతినిధులయ్యారు. జిల్లాల పునర్విభజనతో కొత్తగా 28 గ్రోత్ సెంటర్లు ఏర్పడి త్వరితగతిన వృద్ధి చెందుతున్నాయి. ప్రతి పట్టణం, గ్రామంలో ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠ ధామాలు ఒక్క తెలంగాణలోనే కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అడవుల విధ్వంసం వల్ల భూతాపం పెరిగి పర్యావరణం దెబ్బతింటూ, మానవ మనుగడ ప్రశ్నార్థకంగా తయారైంది. ఇది అత్యంత జటిల సమస్యగా పాలకులకు పెను సవాలుగా పరిణమించింది. పిల్లలు, యువత తమ భవిష్యత్తును, బతికే హక్కును హరించే హక్కు పాలకులకు ఎక్కడిదని నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ సమస్య తీవ్రత గ్రహించిన సీఎం కేసీఆర్ 'పచ్చని చెట్లు మానవ మనుగడకు ఆయువు పట్టు'గా భావించి తెలంగాణకు హరితహారం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో ఇప్పటి వరకు 292 కోట్ల మొక్కలు నాటారు. దీంతో రాష్ట్రంలో గ్రీన్ కవర్ దాదాపు 10 శాతం పెరిగింది. ఈ పవిత్ర యజ్ఞ ఫలితం భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, పర్యావరణాన్ని వారసత్వంగా అందిస్తుంది. గ్రామీణాభివృద్ధిపైనా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల స్వయం సమృద్ధికి, అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించడంతో తెలంగాణ పల్లెలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగాయి. తాజాగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన జాతీయ అవార్డుల్లో 30 శాతం మన రాష్ట్రం కైవసం చేసుకోవడం మన పల్లెలు సాధించిన ప్రగతికి నిదర్శనం. ఆరోగ్యం, సమృద్ధిగా మంచినీరు, సామాజిక భద్రత, పేదరిక నిర్మూలన, జీవనోపాధి, సుపరిపాలన, పచ్చదనం-పరిశుభ్రత, స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాల విభాగాల్లో తెలంగాణ పల్లెలు ఏటా అవార్డులు సాధిస్తున్నాయి. ఇక కేసీఆర్ మార్గ నిర్దేశనంలో, మంత్రి కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ పారిశ్రామికరంగం అద్భుత వృద్ధిని సాధిస్తున్నది. మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అంతర్జాతీయ కంపెనీలకు వివరిస్తూ కోట్లాది రూపాయల పెట్టుబడులను సాధిస్తున్నారు. ఒకనాడు విదేశాలకు సాగిన మేధోవలసలు నేడు తెలంగాణకు జరుగుతున్నాయి. సమర్థ పాలన, నైపుణ్య లభ్యత, నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తు, శాంతిభద్రతలు, లింక్ రోడ్లు, మెట్రోరైల్, ఫ్లై ఓవర్లు, అండర్పస్లు, సబ్ వేలు, స్కైవాక్ లు, కేబుల్ బ్రిడ్జిలు, అందమైన పార్కులతో హైదరాబాద్ పరిశ్రమల స్థాపనకు అనువైనదిగా మారింది. రియల్ ఎస్టేట్ కూడా బాగా వృద్ధి చెందుతున్నది. భూమి ధర ఎకరా రూ.100 కోట్లయినా సొంతం చేసుకొనేందుకు కొనుగోలుదారులు పోటీ పడుతున్నారు. మరోవైపు టీ-హబ్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కేసీఆర్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ద్వితీయ శ్రేణి నగరాలకు కుడా ఐటీ రంగాన్ని విస్తరించింది. 2014లో రాష్ట్రంలో మూడున్నర లక్షల ఐటీ ఉద్యోగులు ఉండగా, వారి సంఖ్య 2023 నాటికి తొమ్మిది లక్షలైంది. ఐటీ ఎగుమతులు 75 వేల కోట్ల నుంచి సుమారు రూ.3 లక్షల కోట్లకు పెరిగాయి. రాష్ట్ర రాజధానిలో తెలంగాణ ఠీవి ఉట్టిపడేలా పాలనా సౌధమైన సచివాలయాన్ని ఆధునికంగా నిర్మించింది. తెలంగాణ ప్రభుత్వం. దాని చెంతనే రాజ్యాంగ నిర్మాత 4 బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని, అమరుల త్యాగాన్ని నిత్యం స్మరించుకునేలా అమర జ్యోతిని నిర్మించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కీలకమైన శాంతి భద్రతల నిరంతర పర్యవేక్షణ కోసం ప్రపంచ స్థాయి సాంకేతికతతో దేశంలో ఎక్కడాలేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లాకు సమీకృత జిల్లా కార్యాలయాలు, జిల్లా పోలీస్ కార్యాలయాలు నిర్మించింది. దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్ టైల్ పార్క్ ను వరంగల్ లో నిర్మించింది. ప్రసిద్ధి చెందిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కళ్లు మిరుమిట్లు గొలిపేలా, మనసు పులకరించేలా, ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడేలా పునర్నిర్మించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును ఐదేండ్లలో పూర్తిచేసి లక్షలాది ఎకరాలకు నీళ్లందించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్. గతంలో శ్రీరాంసాగర్ భారీప్రాజెక్టు నిర్మించి, నీళ్లందించడానికి జీవితకాలం పట్టగా తక్కువ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేయడం కేసీఆర్ సమర్థతకు నిదర్శనం. ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను రీడిజైన్ చేసి, త్వరితగతిన పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయమైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గురించి గోరంటి వెంకన్న 'పల్లె కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల' అనే పాట రాశారు. ఉద్యమసమయంలో ఆ పాట విన్న కేసీఆర్ మనసు చలించింది. ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్న కేసీఆర్ ప్రభుత్వం భీమా. నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేసి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగా, వలస బిడ్డలు తమ స్వస్థలాలకు తిరిగి వచ్చారు. నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పిస్తున్నది. పాలమూరు-రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడంతో రేపు ఈ జిల్లా దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ కానుంది. ఇలా మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, కొత్త ఆలోచనలతో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నది తెలంగాణ రాష్ట్రం. ఏక కాలంలో ప్రజల తక్షణావసరాలు, దీర్ఘకాలిక అవసరాలు, శాశ్వత అవసరాలు తీరుస్తూ భావి తరాల భవిష్యత్తుకు బంగారు బాటలువేస్తున్న నాయకుడు కేసీఆర్. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు తపన.. ప్రజల సమస్యలపై అవగాహన.. వాటిని పరిష్కరించాలన్న దీక్ష,ప్రాంతంపై సంపూర్ణ అవగాహన, మొక్కవోని ఆత్మ విశ్వాసం, పకడ్బందీ కార్యాచరణ. ఇవన్నీ మనకు కేసీఆర్ కనిపిస్తాయి. ఒకప్పుడు పశ్చిమబెంగాల్ ఆలోచనా విధానాన్ని దేశమంతా అనుసరించేది. నేడు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించి అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.

Comments

Popular posts from this blog

పాలకుల కుట్రలపై త్యాగాల విజయం ..సిరికొండ మధుసూదనాచారి

సుందర సత్సంగము

కలికి కళ్ళెం వేయండి