నీటి పారుదల రంగ ఆణిముత్యం

నమస్తే తెలంగాణ 01 అక్టోబర్ 2023 నీటి పారుదల రంగ ఆణిముత్యం ఇంజినీర్ కె.పెంటారెడ్డి Artical Writer: కె. వెంకట రమణ 9849905900 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతే మన రాష్ట్రానికి చెందిన వివిధ రంగాల్లో నిష్ణాతులు, ప్రముఖుల గురించి తెలుసుకోవడం, బాహ్య ప్రపంచానికి వెల్లడవడం ప్రారంభమైంది. అలాంటి తెలంగాణ మట్టి బిడ్డల్లో ఒకరు, ఎత్తిపోతల రంగ నిష్ణాతులు, ఇంజినీర్ కె.పెంటారెడ్డి. ఈఎన్సీగా రిటైర్డ్ అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ప్రతిభను, కార్యదక్షతను గుర్తించారు. అందుకే ఎత్తిపోతల రంగ సలహాదారుగా నియమించారు. విద్యుత్ శాఖలో పెంటారెడ్డి సూపరింటెండెంట్ ఇంజినీరుగా పదవీ విరమణ చేశారు. పదవిలో ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంలో పుట్టంగండి పంప్ హౌజ్ నిర్మాణం, పంపులను అమర్చడం తదితర పనులను విద్యుత్తు శాఖ తరపున పర్యవేక్షించారు. 18 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 పంపులను ఈ పంప్ హౌజ్లో అమర్చారు. వీటిని తయారుచేసింది బీహెచ్ఈఎల్. 100 మీటర్ల సింగిల్ లిఫ్ట్ ద్వారా నీటిని ఎత్తిపోసే ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో తెలంగాణలో భారీ ఎత్తిపోతలకు డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం చేపట్టిన అన్ని ఎత్తిపోతల పథకాల్లో కూడా పంపులు, మోటర్లను అమర్చడంలో పెంటారెడ్డి సహకారమందించారు. రిటైరైన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపకల్పనలో పాలుపంచుకున్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం తరపున ఈ పథకం అమలు కోసం జరిగిన భావప్రచారంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా తిరిగి ప్రచారం చేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే సీఎం కేసీఆర్ పెంటారెడ్డిని సాగునీటి శాఖలో ఎత్తిపోతల సలహాదారుగా నియమించారు. ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే పంప్ హౌజ్లు ఇవ్వాళ్ల సమర్థవంతంగా పని చేస్తున్నాయి. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రిచే ప్రారంభింపచేసిన మోటర్ కలిపి పెంటారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించిన మోటర్ల సంఖ్య మొత్తం 251. ఇన్ని భారీ పంపులను తిప్పిన ఇంజినీర్ దేశంలో మరొకరు లేరు. ఈ ఘనత సాధించిన పెంటారెడ్డి తెలంగాణ వాడు కావడం మనకు గర్వకారణం. తెలంగాణే కాదు, భారతదేశం గర్వించదగ్గ ఇంజినీర్ పెంటారెడ్డి. ఆయన సారథ్యంలో పాలమూరు ఎత్తిపోతల వంటి అనేక ప్రాజెక్టుల్లో పంపులు అమర్చారు. అంతేకాదు, ఐడీసీ వారి చిన్న ఎత్తిపోతల పథకాలను వందల సంఖ్యలో పునరుద్ధరించారు. ఈ పనుల కోసం వయసును లెక్క చేయకుండా నిరంతరాయంగా పర్యటిస్తూనే ఉన్నారు. కల్వకుర్తి పంప్ హౌజ్ మునిగిపోతే ఒక నెలలో పునరుద్ధరిస్తామని ప్రకటించి ఆ పనిచేసి చూపించారు. కాళేశ్వరం పంపులను కూడా 3 నెలల్లో పునరుద్ధరించి చూపారు. పంప్ హౌజ్ నిర్వహణ కోసం ఒక సమగ్రమైన ఆపరేషన్ మాన్యువల్ ను తయారుచేశారు పెంటారెడ్డి. అనేక మంది యువ ఇంజినీర్లను తన వారసులు గా తీర్చిదిద్దారు. ఆయన మార్గనిర్దేశనంలో యువ ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీర్లు తర్ఫీదు పొంది పంప్ హౌజ్లను నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో ఆయన సేవలు ఎల్లపటికీ నిలిచిపోతాయనటంలో సందేహం లేదు.

Comments

Popular posts from this blog

మంచిమాటలు

మంచిమాటలు

15- 9th page