పాలకుల కుట్రలపై త్యాగాల విజయం ..సిరికొండ మధుసూదనాచారి
నమస్తే తెలంగాణ
పాలకుల
పాలకుల కుట్రలపై త్యాగాల విజయం
..సిరికొండ మధుసూదనాచారి
(ఎమ్మెన్సీ, తెలంగాణ తొలి స్పీకర్,
(ఎమ్మెన్సీ, తెలంగాణ తొలి స్పీకర్, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు)
తెలంగాణ - నిన్న ॥ నేడు ॥రేపు -1
తెలంగాణకు ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టి చంపండని ప్రమాణం చేసి, వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యంతో తెలంగాణ సాధించుకుందామని 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్-నేడు బీఆర్ఎస్)ని స్థాపించారు. తెలంగాణను నిర్వీర్యం చేస్తున్న పాలకుల కుట్రలను త్యాగాలతో ఎదిరించి అంతిమ లక్ష్యం చేరాలని, పదవుల కోసమే తెలంగాణవాదమనే అపవాదు చెరిపి పదవుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయాలని ఆయన సంకల్పించారు. తెలంగాణ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు రాష్ట్ర సాధనే ఏకైక పరిష్కారంగా భావించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించారు. ఈ త్యాగాల పరంపర తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు అడుగడుగునా కొనసాగింది.
2001 కు ముందు జరిగిన సంఘటనలను సింహావలోకనం చేస్తే.. తెలంగాణ ప్రజల అభీష్టాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలోని హేతుబద్ధతను గ్రహించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని దశాబ్దాల క్రితమే ఫజల్ అలీ కమిషన్ సిఫారసు చేసింది. ఫజల్
అలీ కమిషన్ సిఫారసులను ఇతర రాష్ట్రాల విషయంలో అమలు చేసి, తెలంగాణ విషయంలో
మాత్రం తుంగలో తొక్కి ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణను కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం కుట్రల పరంపరలో మొదటిది. విశాలాంధ్ర ఉద్యమం తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం జరగడం కుట్రలో కొనసాగింపే. విలీన ప్రతిపాదన సందర్భంగా తెలంగాణ ప్రజలు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమయ్యాయి. 1989 నాటికి తెలంగాణపై ఆంధ్రా పాల
కుల ఆధిపత్యం పతాక స్థాయికి చేరింది. 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. నాటి ప్రభుత్వం ఉద్యమ పవిత్రతను అర్థం చేసుకోకపోగా వందలాది మందిని కాల్చి చంపడం ఉద్యమాన్ని ఆణచివేసే హేయమైన కుట్ర. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశం మొత్తం ఇందిరాగాంధీకి బ్రహ్మరథం పట్టింది. తెలంగాణ ప్రజలు మాత్రం ఏకపక్షంగా తెలంగాణ వాదులను గెలిపించారు. ఈ తీర్పు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రజల ప్రజల ఆకాంక్షకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రాన్ని తక్షణమే ఏర్పాటుచేయాల్సిన ధర్మాన్ని విస్మరించిన కాంగ్రెస్ తెలంగాణ లోక్‌సభ సభ్యులను నిస్సిగ్గుగా తమ పార్టీలో విలీనం చేసుకోవడం అప్రజాస్వామిక కుట్ర. జై ఆంధ్ర ఉద్యమాన్ని చల్లార్చడానికి చేసిన మరో కుట్రే ఆరు సూత్రాల పథకం. తెలంగాణ వాదాన్ని అభాసుపాలు చేయాలనే కుట్రలో భాగంగా కొన్ని సందర్భాల్లో
తెలంగాణకు చెందిన సమర్థులకు మంత్రులుగా అవకాశాలు ఇవ్వకుండా వారిని అవమానించి, రెచ్చగొట్టి తెలంగాణ అంశాన్ని తెర పైకి తెచ్చే పరిస్థితిని సృష్టించి, వారిని శాంతింపజేయడానికి పదవులు కట్టబెట్టేవారు. తెలంగాణ అంశం రాజకీయ నిరుద్యోగుల వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం కోసమే కానీ తెలంగాణ వాదులకు చిత్తశుద్ధిలేదని చిత్రీకరించి, ఈ భావనను ప్రజల్లోకి బలంగా చొప్పించి, తెలంగాణ వాదాన్ని అప్రతిష్ట పాలు చేశారు. ఈ విధంగా
తెలంగాణ అంశాన్ని ప్రస్తావించలేని పరిస్థితిని కల్పించడం మరో కుట్ర. ఐదున్నర దశాబ్దాల కాలం తెలంగాణ విషయంలో అన్ని పార్టీల నేతలది అన్యాయం చేసే వైఖరే ఆ చర్యల్లో భాగంగానే నాటి ప్రభుత్వం 'వ్యవసాయం దండుగ అని ప్రకటించి తెలంగాణ రైతుల ఆత్మ
స్థైర్యాన్ని దెబ్బతీసింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అప్పటికే ఆత్మహత్యలతో కునారిల్లుతున్న తెలంగాణ రైతాంగంపై విద్యుత్తు చార్జీల పెంపు నిర్ణయం భూమికి రైతులను శాశ్వతంగా దూరం చేసే కుట్రగా మారింది. 2000 సంవత్సరంలో డిప్యూటీ స్పీకర్ గా
ఉన్న కేసీఆర్ విద్యుత్తు ఛార్జీల పెంపును తీవ్రంగా ఖండిస్తూ ఆ నిర్ణయం వల్ల తెలంగాణ సర్వనాశనం కావడం ఖాయమని ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా ఆందోశన చేస్తున్న రైతులను పోలీసులు బషీరాబాద్లో దారుణంగా
కాల్చి చంపడం తెలంగాణ ప్రజలను తెలంగాణలోనే బతుకనివ్వని కుట్రగా అభివర్ణించవచ్చు.
ఇలాంటి దుర్మార్గాలన్నింటికీ చరమగీతం పాడాలని, రెండు బలమైన పార్టీలు, రెండు బలమైన సామాజిక వర్గాలు, ఇద్దరు బలమైన నాయకులు, వారికివంత పాడే ప్రసార మాధ్యమాలు, తెలంగాణ పదం పలకడమే నేరం, తెలంగాణ రాష్ట్రం కావాలని అంటే అణచివేయడం, తెలంగాణ గురించి మాట్లాడితే ఏమవుతుందోననే భయం, చుట్టూ గాఢాంధకారం
అలుముకున్న ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ సాహసంతో టీఆర్ఎస్ ను స్థాపించారు. అయితే హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భవనం కిరాయికి ఇవ్వకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. ఇవ్వడానికి ఒప్పుకున్న భవన యజమానులను రాత్రికి రాత్రే
బెదిరించారు. కేసీఆర్ ను పార్టీ పెట్టవద్దని ప్రలోభపెట్టారు, భయపెట్టారు. ఈ చర్యలు కేసీఆర్ ను ఇంకా కసిని పెంచాయి. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప మనస్సుతో తన భవనంలో కార్యాలయం పెట్టడానికి అంగీకరించారు. టీఆర్ఎస్ కు కార్యాలయం ఉండటాన్ని జీర్ణించుకోలేని నాటి పాలకులు కొన్ని నెలలకే, సామగ్రిని బలవంతంగా రోడ్డు మీదకు
విసిరి కార్యాలయాన్ని స్వాధీన పరుచుకోవడం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై జరిగిన
అహంకార పూరిత దాడి, కుట్ర.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని, పార్టీని, తెలంగాణ వాదాన్ని బలోపేతం చేయడంలో భాగంగా కరీంనగర్ 2001 మే 17న భగ్గున మండే ఎండల్లో టీఆర్ఎస్ మొదటి భారీ బహిరంగ సభ విజయవంతమైంది. వరుసగా జిల్లాల్లో సాగుతున్న కేసీఆర్ సభలకు జనం పెద్దఎత్తున తరలివస్తుండటంతో అప్పటి ప్రభుత్వం తెలంగాణ వాదం విస్తృతిని అడ్డుకోవడానికి జూలైలో వరంగల్లో సభ జరుగుతున్న రోజే స్థానిక సంస్థల ఎన్నికలను ముందుకు తెచ్చింది. తెలంగాణ వాదం లేదని చూపే కుట్రలో భాగంగానే ఎన్నికలను ప్రకటించింది. కానీ ప్రజలు స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గణనీయంగా గెలిపించారు. ఆ తర్వాత 2003 జనవరి 6న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 'తెలంగాణ జల సాధన సభ', మార్చిలో 'వెయ్యికార్లతో చలో ఢిల్లీ, ఏప్రిల్లో 'చలో వరంగల్ జైత్రయాత్ర' సభలు బ్రహ్మాండంగా విజయవంతమయ్యాయి. ఢిల్లీ యాత్ర సందర్భంగా పెన్ గంగా, నర్మదా నదుల ఇసుక తిన్నెలే తెలంగాణ వాదులకు
పాన్పులయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణం సజావుగా సాగడానికి, వాహన శ్రేణి నియంత్రణలో ఉండేందుకు వాకీటాకీలను ఉపయోగించారు. ఈ యాత్ర ఉద్యమ చరిత్రలో మరిచిపోలేని ఘట్టం. తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నా, వరంగల్ సభకు సిద్దిపేట నుంచి సైకిల్ పై వచ్చి తెలంగాణపై తనకున్న నిబద్ధతను కేసీఆర్ నిరూపించుకొన్నారు. తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్పూర్తిని నింపారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బాపూజీ పిలుపు మేరకు, ద్రవిడ ఉద్యమంలో పెరియార్ పిలుపు మేరకు రవాణా సౌకర్యాలు అంతగాలేని కాలంలో ప్రజలు ఏ రకంగా తరలివచ్చారో అదే తీరులో కేసీఆర్ సభలకు జనం కాలినడకన; ఎడ్ల బండ్లు, సైకిళ్లు, బైకులు,
ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలతో తండోపతండాలుగా వచ్చారు. రవాణా సౌకర్యాలున్నా
కేసీఆర్ పిలుపు మేరకు చాలా మంది ప్రజలు కాలినడకన రావడం ప్రజా స్పందనకు, తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రబలమైన ఆకాంక్షకు నిదర్శనం.
పైన తెలిపిన మూడు భారీ కార్యక్రమాలను నాలుగు నెలల స్వల్ప కాలంలోనే ఆనాడు ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ విజయవంతంగా నిర్వహించడం కేసీఆర్ అద్భుత నాయకత్వ పటిమకు నిదర్శనం. దేశ చరిత్రలో కొన్ని నెలల వ్యవధిలో ఇన్ని భారీ
కార్యక్రమాలు ఎక్కడా జరిగి ఉండవు. కేసీఆర్ నాయకత్వంలో 2003లో జరిగిన మూడు బహిరంగ సభల తర్వాత టీఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం ప్రారంభించింది.
దీన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పొత్తు ద్వారా మాత్రమే అధికారం సాధ్యమవుతుందని భావించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. ఎన్నికల్లో
టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశాన్ని చేర్చారు. నాటి రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో చెప్పించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ పత్రికా సమావేశంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావించారు. అనంతరం ఏర్పాటైన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి 32 పార్టీలకుగాను 28 పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా లేఖలు ఇచ్చేలా కేసీఆర్ కృషి చేశారు. అయితే రాష్ట్రం ఏర్పాటుకు పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేయడంతో టీఆర్ఎస్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వైదొలిగింది. ఇలా తెలంగాణ ప్రాంతంపై ఎన్ని కుట్రలు సాగినా కేసీఆర్ మాత్రం తన త్యాగాల పంథాను వదల్లేదు. పోర్ట్ ఫోలియోను, మంత్రి పదవులను, పార్లమెంట్, అసెంబ్లీ సభ్యత్వాలను త్యాగం చేస్తూ ప్రతి కుట్రను త్యాగంతో ఎదుర్కొని అడుగడుగునా తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన నిబద్దత కేసీఆర్.
Comments
Post a Comment