15th chapter 7th slokam

శ్లో॥ మమైవాంశో జీవలోకే జీవభూత స్పనాతనః
మన షష్ట్మాణీవ్రియాణి ప్రకృతిస్థావి కర్షతి! || 7 ||

సవాతనమైన నా అంశమే జీవలోకము నందు జీవుడై ప్రకృతిలోని ఆరు
ఇంద్రియములను ఆకర్షించుచున్నది.

15 అధ్యాయము  పురుషోత్తమప్రాప్తి యోగము 7 వ శ్లోకము 
అర్జునా! సనాతనమైన నా అంశమే సంసారంలో జీవ రూపంతో ఉంది. ప్రకృతి లోని ఇంద్రియ మనస్సులు ఆరింటికి తన వైపుకు ఆకర్షిస్తూ ఉంది.
వ్యాఖ్య
నేను ఉన్నాను (అహమస్మి) అనే వాక్యములో 'నేను' అనే పదము దేహానికి సంబంధించింది కాదని, ఇంద్రియాలకు సంబంధించింది కాదని, ప్రాణానికి సంబంధించింది కాదని, మనస్సుకు సంబంధించింది కాదని ఇప్పటికే మనం తెలుసుకున్నాం. అలాగే ఈ లోకములో 'నేను' అనే వస్తువు లేదని కూడా అర్థం చేసుకున్నాం.
'నేను' అంటే జీవుడు. చైతన్య రూపుడు.
'నేను' అటూ నేను పలుకుతున్నాను. నీవూ పలుకుతున్నావు. ఆమె కూడా పలుకుతోంది. ఇలా అనేక మంది 'నేను - నేను' అంటూ ఉన్నారు. మరి ఈ 'నేను' యొక్క లక్షణాలు మనిషి మనిషికి భిన్నంగా ఉన్నాయా? లేవు. ఎందరు పలికినా, ఎవరు పలికినా 'నేను' ఒక్కటే. 'అహం' శబ్దార్థ మొక్కటే. అదే జీవుడు.
సద్రూపుడు. ఏక సద్రూపుడు. దేవుడి కన్నా భిన్నం కాని వాడు. జీవుడుగా తెలుస్తున్న వాడు (జీవ భూతః). జీవ లోకంలో, అంటే సంసారములో జీవుడుగా తెలుస్తున్నది (జీవ లోకే జీవ భూతః ) నా యొక్క సనాతన మైన అంశమే ( మమ అంశః ఏవ సనాతనః) అంటున్నాడు భగవంతుడు. అంశము అంటే, భాగము అని, అవయవము లేదా అంగము అని, ఏకదేశ మని అర్థం. జీవలోకంలో, లేదా సంసారంలో (జీవ లోకే జీవానాం లోకే సంసారే భోక్తగా, కర్తగా తెలియ బడుతున్న జీవుడు (జీవ భూతః భోక్తా కర్తా ఇతి ప్రసిద్ధః ) పరమాత్మ యొక్క అంశగా ప్రసిద్ధుడు. అంటే, పరమాత్మ అంశముగా కల్పితుడైన జీవుడు కర్తగా, భోక్తగా ప్రసిద్ధుడు అని అర్థం. అట్టి జీవుడు సనాతనుడు (సనాతనః).
బ్రహ్మము అనంతము, నిష్కలము అని అర్థం చేసుకున్నాం. నిష్కలము అన్నప్పుడు బ్రహ్మము అఖండమే గాని భాగములు, లేక అవయవములు గల వాడు కాడు. మరి, బ్రహ్మము నిర్విశేషము, నిరవయవము అయినపుడు, అట్టి పరమాత్మకు జీవుడు ఒక అంగము, లేదా అంశము అనేది ఎలా సముచితము? జీవుడు బ్రహ్మము నందు అంశమైతే, భాగమైతే, అవయవమైతే, బ్రహ్మము సావయవము అని నిర్ణయించవలసిnవస్తుంది. సావయవమైన దానికి నిత్యత్వము ఉండే అవకాశము లేనందున అది నశించేది అవుతుంది.nఇంతకీ జీవుడు బ్రహ్మము కంటే అన్యంగా ఉన్నాడా? లేక జీవుడుగా తెలిసేది బ్రహ్మ మేనా? లేక
జీవుడు అసలు లేడా? ఈ మూడు ప్రశ్నలు మమై వాంశః శబ్ద ప్రయోగము వలన ఉత్పన్న మవుతున్నాయి.
జీవుడే లేడు అనే మూడవ ప్రశ్న ఉపపన్నం కానే కాదు. జీవుడు లేడు అని అంగీకరిస్తే అహమస్మి - నేనుnఉన్నాను అని చెబుతూ ప్రత్యక్షంగా కనిపిస్తున్న నిన్నే నిరాకరించినట్లు అవుతుంది. కనుక జీవ అభావ ప్రసక్తి నిర్హేతుకం.
ఇక జీవుడు బ్రహ్మము కన్నా వేరైన వాడా? అనే మొదటి ప్రశ్న. జీవుడు వేరు - బ్రహ్మము వేరు అని చెప్పినట్లైతే, జీవుడు చైతన్య రూపుడా, లేక అచేతనుడా? అని మరొక ప్రశ్న ఉదయిస్తుంది. జీవుడు అచేతనుడు ఎలా అవుతాడు? జీవుడే గనుక అచేతనుడయితే, అహం - ఇదం నేను - ఇది; అహం - మమ - నేను - నాది; అనే జ్ఞానము ఎలా కలుగుతుంది? జీవుడు ఏ చెట్టు లాగో, పుట్ట లాగో, కొండ లాగో, బండలాగో పడి ఉండాలి. కనుక జీవుడు సచేతనుడే గాని అచేతనుడు కాడు.
జీవుడు సచేతనుడైతే, బ్రహ్మము కంటే అన్యంగా ఎలా ఉంటాడు? అలా ఉంటే, బ్రహ్మ చైతన్యము, జీవ చైతన్యము అని రెండు చైతన్యాలు ఉండాలి. రెండు చైతన్యాలు ఉంటే, రెండూ దృశ్యాలే అవుతాయి. దృశ్యాలైతే రెండూ నశించి పోతాయి. నశించేది చైతన్యమెలా అవుతుంది? చైతన్యము ఏకము, అద్వయము. అట్టి చైతన్యము దృశ్యము కాలేదు. కనుక మొదటి పక్షముననుసరించి చెప్పాలి అంటే, చేతన మైన జీవుడు అద్వయ బ్రహ్మము కంటే అన్యమైన వాడు కాడు. ఇక మిగిలింది రెండవ ప్రశ్న ఒక్కటే. జీవుడుగా తెలిసేది బ్రహ్మ మేనా? జీవత్వముగా మనం చెప్పుకుంటున్నది బ్రహ్మత్వమేనా? అవును. అదే యుక్తము.
జీవుడే బ్రహ్మ మైతే, పూర్వ శ్లోకాలలో మనం చెప్పుకున్నట్లు బ్రహ్మము పూర్ణము, అనంతము కనుక, జీవుడు కూడా పూర్ణము, అనంతము అయి ఉండాలి. మరి పూర్ణము, అనంతము అయిన బ్రహ్మమునకు సంసారిత్వము అసంగతమైనపుడు జీవునికి మాత్రం సంసారిత్వము ఎలా సంభవము? అదీ గాక, జీవుడే బ్రహ్మ మైతే, తాను పూర్ణుడు, అనంతుడు అనే జ్ఞానము జీవునికి ఎందుకు లేదు? ఈ ప్రశ్నలన్నీ ఉద్భవిస్తాయి.
దానికి శ్రుతి ప్రతిపాదిత సమాధానం ఉంది. జీవుడు బ్రహ్మమే అయినా, అవిద్య చేత జీవుడుగా తెలుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని పదమూడవ అధ్యాయంలో కూడా మనం సవిస్తరంగా చర్చించుకున్నాం. ఇది అంగీకారం గానే ఉంది. ప్రామాణికం గానూ ఉంది. కాకపోతే, సనాతనుడైన జీవుడు నా అంశమే, మమైవాంశః (జీవభూతః మమ సనాతన అంశః ఏవ ) అని భగవానుడు చెబుతున్నది ఎలా సమంజసము? జీవుడు బ్రహ్మము
యొక్క 'అంశ', అంటే భాగము లేక అవయవము అనేది యుక్తమా? ఇరువురికి 'అంశ - అంశి' భావము సమంజసమా?
పరమాత్మ అవయవ సహితమా? లేక నిరవయవమా? బ్రహ్మమే గనుక అవయవ సహితమైతే,
బ్రహ్మమునకు అవయవ విభాగము ప్రాప్తించదా? అదే జరిగితే ఫలం వినాశమే కదా? మరి, నశించేది బ్రహ్మమెలా అవుతుంది?
అనంతము, పూర్ణము అయిన బ్రహ్మములో అవయవము, భాగము, ఏకదేశము అంటూ 'అంశ' ప్రసక్తి ఎలా సంభవము? అనంతమైన బ్రహ్మము అద్వితీయము కావడం చేత, అంశ ప్రసక్తి తలెత్తే అవకాశమే లేదు కనుక, బ్రహ్మము నిరవయవము. నిరవయవ మైన బ్రహ్మమునకు జీవుడు అంశ ఎలా అవుతాడు? అంశకాలేడు. అలాంటప్పుడు మమై వాంశో జీవలోకే జీవ భూతః సనాతనః అని గీతాచార్యుడు ప్రతిపాదించిన విషయము ఎలా సహేతుకము?. ఎలా సశాస్త్రీయము? ఏకము, అద్వితీయము అయిన బ్రహ్మమునకు అంశాంశి భావము ఎలా ఉపపన్నము? నిజమే. ఈ వాదము సహేతుకం గాను, సశాస్త్రీయం గాను, పటిష్ఠం గాను ఉంది. కాకపోతే, జీవబ్రహ్మలకు ఈ అంశాంశి భావము వాస్తవమా లేక కల్పితమా? అనేది ముందు స్పష్టం కావాలి. వాస్తవికంగా అంశాంశి భావము ఉన్నట్లైతే, అది హేతుబద్ధము కాకపోవడమే గాక, ప్రమాణ విరుద్ధము కూడా అవుతుంది. కనుక జీవబ్రహ్మలకు ప్రస్తుత శ్లోకములో భగవానుడు ప్రతిపాదించిన అంశాంశ భావము కల్పితమైనది. ఆరోపితమైనది. అది ఆధ్యాసిక సంబంధమే గాని వాస్తవంగా అద్వితీయ బ్రహ్మమునకు దేనితోనూ ఏ సంబంధమూ లేదు. కనుక, ఆరోపిత అంశాంశి భావము అనుపపన్నం కాదు; శాస్త్ర విరుద్దమూ కాదు. అహేతుకము, అప్రమాణము అసలే కాదు. అనంతమైన బ్రహ్మమునకు ఉపాధి రీత్యా అంశాంశ భావము ఉపపన్నమే. అదెలాగో విశ్లేషించి అర్థం చేసుకుందాం.
అంశ అంశి భావము అద్వితీయమైన బ్రహ్మమునకు వాస్తవిక అంశాంశి భావము సంభవము కాదు. కాని, అవిద్యోపాధితో కూడినపుడు బ్రహ్మమునకు కల్పిత అంశాంశి భావమును చెప్పుట సమంజసమే. ఆకాశము ఏకము. నిరవయవము. అయినా, కుండ అనే ఉపాధి వైశిష్ట్యము చేత ఘటాకాశము అని చెప్పబడుతూ ఉంది. ఘటాకాశము అని ఒక వైపు చెప్పబడుతున్నా, మరో వైపు మహాకాశము తెలుస్తూనే ఉంది.
మహాకాశము నిరవయవంగా, అపరిచ్చిన్నంగా గోచరిస్తున్నా, ఘటోపాధి కారణంగా మహాకాశానికి అంశాంశి భావము సంభవిస్తూ ఉంది. మహాకాశము అంశి కాగా, ఘటాకాశము దాని అంశముగా తెలుస్తూ ఉంది. వాస్తవానికి మహాకాశానికి అంశాంశి భావము లేదు.
ఘట నిమిత్తంగా ఉపపన్నమైన అంశాంశి భావము ఘట భంగం జరిగిన తరువాత, నిమిత్తం తొలగిపోయిన కారణంగా మహాకాశాన్ని పొందుతూ ఉంది. ఉపాధి ఉన్నంత వరకు ఆకాశము ఘటాకాశంగా తెలుస్తూ, మహాకాశానికి కల్పిత అంశగా అర్థమై, ఉపాధి వినిర్ముక్తం కాగానే మహాకాశాన్ని పొంది కల్పిత అంశాంశి భావము నుండి విడిపడి నిరవయవ, అపరిచ్చిన్న స్థితిని పొంది మళ్ళీ తిరిగి రాని స్వరూపాన్ని చేరి పోతుంది
(యథా వా ఘటాద్యుపాధి పరిచ్ఛిన్న: ఘటా ద్యాకాశః ఆకాశాంశః సన్ ఘటాది నిమిత్తాపాయే ఆకాశం ప్రాప్య న నివర్తతే ఇత్యేవమ్!). ఇదే విషయాన్ని నిరూపించడానికి ఆచార్యుల వారు బింబ ప్రతిబింబ న్యాయాన్ని కూడా ఉదహరిస్తారు.
సూర్యుడు కూప జలాలలో ప్రతిబింబిస్తాడు. జలంలో ప్రతిఫలించిన ప్రతిబింబము ఎవరిదో కాదు, సూర్యునిదే. సూర్యుని అంశమే. ఈ విధంగా సూర్యునికి అంశాంశి భావము కల్పించ బడింది. బావిలో జలం ఇంకి పోగానే, నిమిత్తం తొలగి పోయిన కారణంగా, ప్రతిబింబము సూర్యబింబమును చేరి, మళ్ళీ తిరిగి రాదు (యథా జల సూర్యకః సూర్యాంశః జల నిమిత్తాపాయే సూర్య మేవ గత్వా న నివర్తతే).
ఘటోపాధి వలన ఏకము, అద్వితీయము అయిన ఆకాశమునకు కల్పిత అంశాంశి భావము ఉపపన్నమైనట్లు, జలోపాధి కారణంగా ఏకమైన సూర్య బింబమునకు ఆరోపిత అంశాంశి భావము సంభవ మైనట్లు, ఘటోపాధి నిర్ముక్తం కాగానే అపరిచ్చిన్నమైన ఆకాశమునకు కల్పిత అంశాంశి భావము తొలగి పోయినట్లు, జలోపాధి వినిర్ముక్తం కాగానే ఏకమైన సూర్యబింబమునకు అంశాంశి భావము తొలగిపోతూ ఉంది. 
అలాగే పూర్ణము, అనంతము అయిన బ్రహ్మమునకు అంశాంశి భావము అనుపపన్నమే అయినా, బుద్ధ్యుపాధి విశిష్టుడు అయినపుడు, బుద్ధ్యవచ్చిన్ను డైన జీవునికి అంశత్వము కల్పించబడి, జీవుడు బ్రహ్మ యొక్క అంశము - మమైవాంశః (జీవః మమ అంశః ఏవ ) అనేది సంభవించింది. ఉపాధి వినిర్ముక్తం కాగానే పరిచ్ఛిన్నుడుగా తెలిసిన జీవుడు అనంతుడైన బ్రహ్మము గానే భాసిస్తున్నాడు. బ్రహ్మము నందు కల్పించబడిన అంశాంశి భావము లేనిదే అగుచున్నది. ఈ విధంగా బ్రహ్మము నందు అంశాంశి భావము ఆరోపితము.
ఈ విషయాన్ని క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో విస్తరించి చెప్పుకున్నాం ( అయం అర్థః క్షేత్రాధ్యాయే విస్తరశః ) .
జీవుని విషయంలో భిన్నాభిప్రాయాలు ఎన్నో ఉన్నాయి. అన్యులను ప్రక్కన ఉంచితే, సంప్రదాయ గాడిలో నడిచే అద్వైతులలో కూడా అభిప్రాయ భేదా లున్నాయి. ఇది చాలా జటిలమైన విషయము. కనుక, ముముక్షువులకు ఉపకరిస్తుందని సంక్షేపంగా జీవ నిర్వచనం కూడా అందిస్తాను.
జీవ నిర్వచనము
శ్లో || అధిష్టానం చిదాభాసో బుద్ధిః ఏత త్రయం యదా ।
అజ్ఞానాత్ ఏకవ ద్భాతి జీవ ఇత్యుచ్యతే తదా ॥
'అధిష్ఠానమైన ఆత్మ చైతన్యము, బుద్ధిలో ప్రతిఫలించిన చిదాభాస చైతన్యము, బుద్ది అనే ఉపాధి – ఈ మూడు అజ్ఞానము వలన ఒకటిగా గోచరించి నపుడు జీవుడు అని పిలవడం జరుగుతూ ఉంది' అని శ్రీశంకరాచార్య స్వామి స్వాత్మ ప్రకాశిక అనే గ్రంథంలో నిర్వచించారు. పై మూడు అంశాలను పరిశీలిస్తే, ఆత్మ చైతన్యము నిర్వికారం కనుక అది జీవుడు అనలేము.
చిదాభాసుడు మిథ్య కనుక అతడూ జీవుడు కాడు. ఇక మిగిలింది బుద్ది. అది ఎలాగూ జడము కనుక జీవుడు కానేరదు. ఈ మూడిటిలో ఏ ఒక్కటి, లేదా ఏ రెండు జీవుడు కాకపోయినా, మూడు కలిసి నపుడు జీవ నామం వినిపిస్తూ ఉంది అనేది ఆచార్యుల వారి అభిప్రాయము. శ్రీ విద్యారణ్యస్వామి వేదాంత పంచదశిలో ఎలా నిర్వచించారో చూడండి.
చైతన్యం యదధిష్ఠానం లింగదేహశ్చ యః పునః ।
చిచ్ఛాయా లింగ దేహస్థా తత్సంఘో జీవ ఉచ్యతే ॥
అధిష్ఠానమైన ఆత్మ చైతన్యము, లింగ దేహము లేదా సూక్ష్మ శరీరము, లింగ దేహము నందు
ప్రతిబింబించిన చిదాభాసుడు - ఈ మూడు కలిసి జీవుడు అనబడతాడు అని శ్రీ విద్యారణ్యస్వామి వేదాంత పంచదశి గ్రంథం లోని ద్వైత వివేక ప్రకరణములో తెలియ చేశారు (వేదాంత పంచదశి ; 4 వ అ - 11 వ శ్లో).
శ్రీ శంకరుల నిర్వచనానికి, శ్రీ విద్యారణ్యుల నిర్వచనానికి పరస్పరం అభేదమే. శ్రీ శంకరులు బుద్ధి అన్నారు. శ్రీ విద్యారణ్యులు లింగ దేహము అన్నారు. రెండూ ప్రకృతి పరిణామాలే, గుణ పరిణామాలే. బుద్ధి సూక్ష్మ శరీరానికి, లేదా లింగ దేహానికి సంబంధించిందే కదా! దీనిని శాస్త్రంలో ఆభాసవాదము అంటారు.
ఈశ్వరుడు ఉపాధిలో ప్రవేశించడమే గాక, ఉపాధి మనుగడకు ప్రాణాదులను ప్రేరేపించాడు (సన్నిధి మాత్రేణ) అని కూడా శ్రీ విద్యారణ్యులు చెప్పారు (కృత్వా రూపాంతరం జైవం దేహే ఇతి తాః శ్రుతయః ప్రాహుః జీవత్వం ప్రాణధారణాత్). ఇదంతా శ్రుతి సమ్మతమే. కొందరు జీవ నిర్వచనంలో ఆభాస వాదమును కాకుండా ప్రతిబింబ వాదమును ప్రతిపాదిస్తారు. భామతీ వ్యాఖ్యాత వాచస్పతి వాదము మరో విధంగా ఉంది. అవన్నీ చర్చించడానికి ఇది సందర్భమే అయినా, ఎందుకో నాకు సానుకూలంగా లేదు. ఎంత తిరిగినా భూమి గుండ్రంగా ఉన్న దన్నట్లు, ఎన్ని చెప్పుకున్నా మళ్ళీ శ్రీ శంకరుల దగ్గరికి రావలసిందే. అదెలాగూ చెప్పేశాను 
కనుక చాలు అని సరిపెట్టుకుంటున్నా. ఈ విధంగా దేహంలో ప్రవేశించిన పరమేశ్వరుని అంశ అయిన జీవాత్మ దేహములో అయిదు జ్ఞానేంద్రియాలను, మనస్సుతో కలసి ఆరింటిని తన వైపుకు ఆకర్షిస్తున్నాడు (మనః షష్టాణి ఇంద్రియాణి శ్రోత్రాదీని ఆకర్షతి). ఇక్కడ ఇంద్రియాలు అనేది ఉపలక్షణం. జ్ఞానేంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు అని కూడా అర్థం. ఇలా సంసారంలో ప్రవేశించిన జీవుడు ఒక దేహాన్ని విడిచి మరొక
దేహంలో ప్రవేశించేటప్పుడు, వాటిని వెంట పెట్టుకొని నిష్క్రమిస్తున్నాడు.
అదెలాగో చెబుతున్నాడు.


Comments

Popular posts from this blog

మంచిమాటలు

మంచిమాటలు

15- 9th page