చింతన - గీతా జయంతి సందర్భంగా .. గీతామృత స్నానం ' సకృద్ గీతామృత స్నానం సంసార మలనాశనం ' అని ' గీతా మహాత్మ్యం ' పలుకుతున్నది . అంటే , “ భగవద్గీత ' అనే అమృత జలంతో స్నానం చేసేవారికి సంసారమలం నశించిపోతుంది . కామక్రోధలోభమోహ మదమాత్సర్యాలే మనిషికి ఆరు శత్రువులు . వాటివల్లనే శోకమోహాలు కలుగుతాయి . ఫలితంగా జన్మమృత్యు పరంపర కొనసాగుతుంది . ' గీతామృత స్నానం ' ఆ సంసార మలాన్ని తొలగిస్తుంది . ' గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ నవిద్యతే ' అనికూడ ' గీతామహాత్మ్యం ' పలికింది . అంటే , గీతా గంగాజలాన్ని తాగేవారికి పునర్జన్మే ఉండదు . శ్రీకృష్ణ భగవానుడు ' గీతా సందేశం ' మధ్యమధ్యలో దాని మహిమను పదేపదే చెప్పాడు . ' ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే '. ' అర్జునా ! నువు నాపట్ల ఏనాడూ అసూయ లేనివాడవు . కనుక , ఈ పరమగుహ్యమైన జ్ఞానాన్ని , అనుభూతిని నేను నీకు చెబుతున్నాను ' ( భగవద్గీత : 9-1) అన్నాడు . అంటే , ' గీతాసందేశం అత్యంత రహస్యమైందని , అసూయా రహితుడైన కారణంగా అర్జునునికి తాను చెబుతున్నానని ' భగ...